పంచాయతీల అభివృద్ధిపై ప్రజల మధ్యలోనే చర్చిద్దాం… సిద్ధమా… పేర్ని నాని..?
• మీ నాయకుడు వచ్చినా, మీరు వచ్చినా ఫర్వా లేదు
- వైసీపీ అప్పుల్లో ముంచేసిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోంది
• వ్యవస్థలను నాశనం చేసిన మీరు మాట్లాడటం సిగ్గుచేటు
• ఇంట్లోని మహిళలను అడ్డు పెట్టుకొని అరెస్టు నుంచి తప్పించుకున్న పేర్ని నాని మాట్లాడటానికి సరిపోడు
• అక్రమం, అవినీతి, అన్యాయం, అబద్ధమే వైసీపీ నాయకుల నైజం
• రప్పారప్పా కోసి రాష్ట్రాన్ని శ్మశానం చేయాలని వైసీపీ నాయకుడి ఆలోచన
• పవన్ కళ్యాణ్ లాంటి నిజాయతీ నాయకుడిపై మాట్లాడటానికి వైసీపీకి నైతిక హక్కు లేదు
• మంగళగిరిలో విలేకరుల సమావేశంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్
‘వైసీపీ నాయకులు గడప దాటి గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ధి ఏమిటో కళ్లకు కట్టినట్లు తెలుస్తుంద’ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ పంతం నానాజీ చెప్పారు. రాష్ట్రాన్ని రూ.10 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి, ప్రతి గ్రామాన్ని 80 లక్షల టన్నుల చెత్తలో నింపేసి వైసీపీ అధికారంలో నుంచి దిగిపోయిందని, దాన్ని మొత్తంగా కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తూ ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఇంట్లోని మహిళలను అడ్డుపెట్టుకొని అరెస్టు నుంచి తప్పించుకోవాలని, చట్టం కళ్లు గప్పాలని చూస్తున్న మాజీ మంత్రి పేర్ని నానికి, పరదాల చాటున పరిపాలన చేసిన వైసీపీ నాయకుడికిగాని ఇవన్నీ తెలుస్తాయనుకోవడం తప్పని పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ ‘‘ఒకేసారి 13,324 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని పక్కా ప్రణాళికతో వాటిని పల్లె పండుగ ద్వారా చేసిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 1312 కిలోమీటర్ల తారురోడ్లు, 344 అనుసంధాన రోడ్లు, గోకులాలు, నీటి కుంటలు ఏర్పాటు చేయడమే కాకుండా, అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా డోలి రహిత ఏజెన్సీ సాకారానికి ఆయన గొప్ప ఆలోచనతో ముందుకు వెళ్తున్న తీరును ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. వైసీపీ నాయకులకు మాత్రం అర్ధమే కావడం లేదు.
వైసీపీ పాలనలో విధ్వంసం అయిన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం
యుద్ధం తర్వాత శకలాలను తొలగించుకొని ముందుకు వెళ్తున్నట్లుగా గత వైసీపీ అయిదేళ్ల విధ్వంసకర పాలనా యద్ధం తర్వాత రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతంగా ముందుకు వెళ్తున్నారు. దీనిని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. గత ఏడాది పాలనలో వైసీపీ నాయకులపై మేం మాట్లాడలేదు. విమర్శలు చేసుకుంటూపోతే, పాలన ముందుకు సాగదు అనే మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానంతోనే మేం సైలెంట్ గా ఉన్నాం. ఇప్పుడు పేర్ని నాని వంటి వారు పవన్ కళ్యాణ్ ని ఇష్టానుసారం విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదు. వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసిన వైసీసీ నాయకుడు, ఇప్పుడు వ్యవస్థల గురించి చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉంది. ఉపాధి హామీ పథకం నిధులను చక్కగా వినియోగించుకుంటూ రాష్ట్రానికి మరో 5 ఏళ్లపాటు పుష్కలంగా నిధులు తీసుకొచ్చిన ఘనత, వైసీపీ పాలనలో నిర్వీర్యం అయిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని మరో రెండేళ్లపాటు గడువు పొడిగించిన ఆలోచన పవన్ కళ్యాణ్ కే చెందుతుంది. ఏడాదిలోనే పిఠాపురంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి చూపించడమే కాకుండా, జల్ జీవన్ మిషన్ ద్వారా రాయలసీమ ప్రాంతంలో కూడా ప్రతి ఇంటికి కుళాయి నీరు అందిస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ పార్టీ జెండా కోసం కాకుండా జాతీయ జెండా ప్రతి గ్రామంలో సగర్వంగా ఎగరాలని వచ్చిన వెంటనే పంచాయతీలకు జాతీయ పండుగ నిర్వహణ నిమిత్తం భారీగా నిధులు పెంచి తన దేశ భక్తిని చాటుకున్న నిబద్ధత పవన్ కళ్యాణ్ కే సొంతం. గత వైసీపీ హయాంలోని కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లలు పరిష్కరిస్తూ, అస్తవ్యస్తంగా చేసిన పనులను గాడిన పెడుతూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మేం పేర్ని నానికి, ఆయన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఈ సారి మళ్లీ గ్రామసభలు నిర్వహించి జరిగిన పనుల గురించి ప్రజల మధ్యలోనే చర్చిద్దాం రండి. పవన్ కళ్యాణ్ పాలన, ఆయన ప్రణాళిక వల్ల ఎలాంటి మంచి పనులు జరిగాయో మీకే తెలుస్తుంది.
కబ్జాకోరు… భూ బకాసురుడు పేర్ని నాని : షేక్ రియాజ్
ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ షేక్ రియాజ్ మాట్లాడుతూ ‘‘24 ఎన్నికల ముందు కొల్లేరులో 600 ఎకరాల కొల్లేరు భూమిని కబ్జా చేసిన పేర్ని నాని అప్పటి జిల్లా కలెక్టరును బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేశాడు. తన అక్రమాలకు వంతపాడని వారిని తప్పించాలనే పేర్ని నాని తన భార్య పేరు మీద గోదాము తీసుకొని పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టించిన ఘనుడు. చట్టానికి దొరికిపోయిన తర్వాత కూడా రకరకాల ఎత్తులు వేసి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. జగనన్న కాలనీల పేరుతో వందల కోట్లు ఇసుక అడ్డంగా దోచుకున్న అక్రమార్కుడు.
ఆరు నియోజకవర్గాల్లో ఫైబర్ నెట్ ను తన సొంత కొడుకు పేరుతో దోచేశాడు. పేర్ని నాని బినామీలు, అనుచరుల భూములు ఉన్న చోట
మెడికల్ కళాశాల నిర్మాణాన్ని తీసుకెళ్లి మచిలీపట్నం అభివృద్ధిని అడ్డుకున్న కిరాతకుడు పేర్ని నాని. అసలు ఆయన తండ్రి పేర్ని కృష్ణమూర్తి చనిపోయిన తర్వాత దహనసంస్కారాలు విక్టోరియా అనే మహిళ ఇంటి నుంచి ఎందుకు సాగాయో కూడా పేర్ని నాని సమాధానం చెప్పాలి..? అక్రమాలకు, అవినీతిగా, రౌడీయిజానికి ప్రతీక అయిన పేర్ని నాని, నీతికి, నిజాయతీకి మారుపేరుగా నిలిచి పాలన సాగిస్తున్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిపై మాట్లాడటం దారుణం. కనీసం పవన్ కళ్యాణ్ పేరు కూడా పలకడానికి పేర్ని నానికి అర్హత లేదు.
రాష్ట్రాన్ని శ్మశానం చేయాలని రప్పారప్పా కోస్తారా..?
గూండాలను, రౌడీలను, బెట్టింగ్ రాయుళ్లను పరామర్శించడానికి అనే పేరుతో వైసీపీ నాయకుడు యాత్రలు చేస్తున్నాడు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. తమకు ఓటేయని అందరినీ రప్పారప్పా కోస్తామని బహిరంగంగా చెబుతున్నారు. అంటే రాష్ట్రాన్ని మొత్తంగా శ్మశానం చేస్తామని చెబుతున్నట్లే. ఇదేనా ప్రజలకు మీరు చేసే సేవ..? మీ కార్యకర్త అయినా, ప్రజలైనా, ఇంకెవరైనా రాష్ట్రంలో విధ్వసం చేస్తామంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు జాగ్రత్త” అన్నారు.
రాష్ట్రం కోసం ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ చిల్లపల్లి శ్రీనివాసరావు
ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘దేశం గురించి, రాష్ట్ర ప్రగతి గురించి నిత్యం ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ పాలన పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి ప్రజలలో ఉంటూ, అభివృద్ధి కోసం నిత్యం తపిస్తున్న ఉప ముఖ్యమంత్రివర్యుల గురించి ఇష్టానుసారం మాట్లాడటం వైసీపీ నాయకులు మానుకోవాలి. అస్తవ్యస్తంగా మారిన జల్ జీవన్ మిషన్ పనులను, నిధుల లభ్యతను తిరిగి గాడిలో పెట్టడానికి కేంద్రంతో మాట్లాడి ఒప్పించారు. పంచాయతీలకి, వైభవం పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. గిరిజనులకు రోడ్లును వేస్తూ, వారికి ఆరోగ్య సేవలను దగ్గర చేశారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో పలు దఫాలు చర్చించి కుంకీ ఏనుగులను రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఆయన చేస్తున్న పనులు రాష్ట్ర ప్రజలకు అర్ధం అవుతున్నా, వైసీపీ నేతలకు మాత్రం కనిపించకపోవడం శోచనీయం. వ్యవస్థలను నాశనం చేసిన వైసీపీ ఇప్పుడు వ్యవస్థలు, శాఖల పని తీరు గురించి మాట్లాడడానికి కూడా సరిపోదు’ అన్నారు.