ఎన్టీఆర్ జిల్లా, జూన్ 24, 2025
నైపుణ్యాభివృద్ధి.. ఆర్థిక వృద్ధికి సోపానం
- ప్రతి మండలానికీ నైపుణ్య శిక్షణ కేంద్రం అవసరం
- పీఎం ఇంటర్న్‌షిప్, పీఎం సూర్యఘర్‌పై ప్రత్యేక దృష్టిపెట్టండి
- సమష్టి కృషి, సమన్వయంతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషిచేద్దాం
- యోగాంధ్ర స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జిల్లా కృషి భేష్
- దిశ కమిటీ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
ప్రణాళికాబద్ధ ఆర్థిక పురోగతికి ముఖ్యంగా యువతలో నైపుణ్యాభివృద్ధి కీలకమని.. ప్రతి మండలంలో స్థానిక పారిశ్రామిక అవసరాలు, అభివృద్ధికి దోహదంచేసే వనరులను దృష్టిలో ఉంచుకొని నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జగ్గయ్యపేట, తిరువూరు శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, కొలికపూడి శ్రీనివాసరావు హాజరైన ఈ సమావేశంలో వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పురోగతి, భవిష్యత్తు కార్యాచరణ, సమస్యల గుర్తింపు, పరిష్కారానికి చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి మంగళవారం నాటికి ఏడాది అయ్యిందని, ఈరోజు జిల్లా సమగ్రాభివృద్ధికి కీలకమైన దిశ కమిటీ సమావేశంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, సమన్వయంతో అమలవుతున్న పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించడంతో పాటు పథకాలు, కార్యక్రమాల అమల్లో లోటుపాట్లను గుర్తించి సమస్యల పరిష్కారానికి కృషిచేసేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందన్నారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారుల సూచనలను పార్లమెంటు సమావేశాల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని, జిల్లా సమగ్రాభివృద్ధికి మరిన్ని నిధుల సాధనకు కృషిచేయనున్నట్లు తెలిపారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాకారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా అడుగులేద్దామని పిలుపునిచ్చారు. జిల్లాలో పీఎం ఆవాస్ యోజన కింద 1,08,836 గృహాలు మంజూరుకాగా 75 శాతం గృహాల గ్రౌండింగ్ జరిగిందని.. 22,293 ఇళ్ల నిర్మాణాలుపూర్తికాగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు వివరించగా.. బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీలకు రాష్ట్ర ప్రభుత్వమిచ్చే అదనపు సాయాన్ని ఉపయోగించుకొని నిర్మాణాలను పూర్తిచేసుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని ఎంపీ సూచించారు.
పెద్దఎత్తున కిసాన్ మేళాలు నిర్వహించాలి:
రైతు సేవా కేంద్రాల ద్వారా వరి, పచ్చిరొట్ట, అపరాల విత్తనాల పంపిణీ జరుగుతోందని.. అదేవిధంగా 2025-26లో 14,864 భూసార పరీక్షల నమూనాలు లక్ష్యం కాగా ఇప్పటివరకు 13,949 నమూనాలు సేకరించినట్లు వ్యవసాయ అధికారులు వివరించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ఖరీఫ్ – 2025కు సంబంధించి పీఎం ఫసల్ బీమా యోజన పథకంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను పరిచయం చేసేందుకు, దిగుబడులు తద్వారా ఆదాయాలు పెరిగేందుకు దోహదపడే కిసాన్ మేళాలను పెద్దఎత్తున నిర్వహించాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని ఎంపీ సూచించారు. 2025-26లో 46,118 మంది రైతుల ద్వారా 21,993 హెక్టార్లను ప్రకృతిసాగులోకి తీసుకొచ్చే లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషిచేయాలన్నారు.
*పీ4 విధానం అమల్లో జిల్లాను ముందు నిలిపేందుకు కృషి: *కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
పేదరిక నిర్మూలనకు వినూత్న విధానమైన పీ4 విధానం అమల్లో జిల్లాను ముందంజలో నిలిపేందుకు టీమ్ ఎన్టీఆర్ కృషిచేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త లక్ష్యాలను చేరుకునేందుకు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా జిల్లా పారిశ్రామికంగా మరింత ముందుకెళ్లేందుకు వీలుంటుందన్నారు.
దిశ సమావేశంలో సాక్షమ్ అంగన్వాడీలు, మైలవరం, వీరుళ్లపాడు, ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, ఎ.కొండూరు మండలాలను కవర్‌చేసే స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ (ఎస్‌వీఈపీ) బ్లాక్, పీఎం విశ్వకర్మ యోజన, జిల్లాలో మూడు దశల్లో మంజూరైన 29 పీఎం శ్రీ స్కూళ్లు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి పథకాల అమలు, పీఎం సూర్యఘర్, పీఎం ఇంటర్న్‌షిప్ తదితరాలపై ప్రభావవంతమైన చర్చ జరిగిందని.. సమావేశంలో లేవనెత్తిన అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
సమావేశంలో జెడ్‌పీ సీఈవో కె.కన్నమనాయుడు, సీపీవో వై.శ్రీలత, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, డీఈవో డీఎంఎఫ్ విజయకుమారి, డ్వామా పీడీ ఎ.రాము, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, హౌసింగ్ పీడీ పి.రజనీకుమారి, డీఈవో యూవీ సుబ్బారావు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మునిసిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.