నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు : యార్లగడ్డ
హనుమాన్ జంక్షన్ :
గన్నవరం నియోజకవర్గంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా కు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. తేలప్రోలు, వీరవల్లి విద్యుత్ ఉప కేంద్రాల పరిధిలోను మల్లవల్లి గ్రామంలోనూ 50 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్తు లైన్లు శిథిలావస్థకు చేరి తరచూ అవాంతరాలు ఏర్పడుతుండటంతో స్థానికులు సమస్యను ఎమ్మెల్యే వెంకట్రావు దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన యార్లగడ్డ ఈ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించి నిధులు మంజూరు చేయించారు. దీంతో బాపులపాడు మండలం వీరవల్లి, తేలప్రోలు విద్యుత్ ఉప కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ అవాంతరాలను తొలగించేందుకు రూ. 2.3 కోట్ల ఖర్చుతో నూతన లైన్ల నిర్మాణానికి కానుమోలు 132 కెవి విద్యుత్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే యార్లగడ్డ శంకుస్థాపన చేశారు. బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామానికి 24 గంటల విద్యుత్ సరఫరా కు నూతన లైన్ల నిర్మాణం విద్యుత్ స్తంభాల మార్పు కోసం 3.5 కోట్ల ఖర్చుతో చేపట్టిన నిర్మాణ పనులను శనివారం సాయంత్రం ఎమ్మెల్యే వెంకట్రావ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలోని గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన విద్యుత్ లైన్ల స్థానంలో కొత్త లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పలు గ్రామాలు విద్యుత్ లైన్ల మార్పులు పూర్తయ్యాయని అవసరమైన చోట సత్వరమే లైన్ల మార్పుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. గృహ అవసరాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వివరించారు. విద్యుత్తు లైన్ల మార్పు నూతన లైన్ల నిర్మాణం నిమిత్తం గన్నవరం నియోజకవర్గానికి రూ.53 కోట్ల నిధులు మంజూరైనట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుతో రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేస్తున్నారని, గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా గణనీయంగా పెరిగిన విద్యుత్ బిల్లుల నుండి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్సీ సత్యానంద్ ఏడిఈ బి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు, టిడిపి నాయకులు ఆళ్ల గోపాలకృష్ణ, దయ్యాల రాజేశ్వరరావు, ఆరుమళ్ళ వెంకట కృష్ణారెడ్డి, కొమ్మారెడ్డి రాజేష్, మూల్పూరి సాయి కళ్యాణి, గుండపనేని బుజ్జి, వేగిరెడ్డి పాపారావు, మున్నంగి బాబురావు, బేతాళ ప్రమీల రాణి, ధన్నే దుర్గారావు, చింతల వెంకట శివ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.