ఎన్టిఆర్ జిల్లా
తేది: 28.06.2025
దోషరహిత ఓటర్ల జాబితా రూపొందించడంలో రాజకీయ పక్షాలు సహకరించండి.
అర్హులైన యువ ఓటర్ల నమోదు దిశగా ప్రోత్సహించండి.
డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం
దోషరహిత, తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించడంలో రాజకీయ పక్షాలు అధికారులకు పూర్తి సహకారం అందించాలని అర్హులైన యువ ఓటర్లను నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.
కలెక్టరేట్లోని ఎవిఎస్‌ఎన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శనివారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో డీఆర్వో లక్ష్మీనరసింహం సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈసీఐ ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతినెలా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పక్షాలు బూత్ లెవెల్ అధికారులతో బూత్ లెవెల్ అసిస్టెంట్లు సమన్వయం చేసుకొని అర్హులైన యువతను ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు సహకరించాల్సిందిగా కోరారు. ప్రస్తుత ఓటర్ల జాబితాలో మరణించినా, శాశ్వతంగా వలస వెళ్లినా వారి పేర్లను బీఎల్వోకు తెలియజేయాలన్నారు. ఓటరు జాబితాలో మార్పులు, ఓటరు కార్డులో ఏవైనా తప్పులు ఉంటే వాటికి సంబంధించి ఫారం-8 నమోదు చేసి, సరిచేసేందుకు సహకరించాల్సిందిగా కోరారు. జిల్లాలో ఫారం 6, ఫారం 7, ఫారం 8 అర్జీలకు సంబంధించిన ప్రస్తుత వివరాలను తెలియజేసి సమాచారాన్ని రాజకీయ పక్షాలకు అందించారు. సమావేశంలో రాజకీయ పక్షాల ప్రతినిధుల సందేహాలను డీఆర్వో నివృత్తి చేశారు.
మరణించిన ఓటర్ల తొలగింపు పై అన్ని స్థాయిలలోను విచారణ చేయాలని, ఒకే కుంటుంబానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్ బూత్‌లో ఉండేలా, ఒకే డోర్ నెంబర్‌తో నమోదై ఉన్న నగరపాలక సంస్థ పరిధిలో అపార్టమెంట్ విషయంలోను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని రాజకీయ పక్షాల ప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
సమావేశంలో ఎన్నికల సెల్ డిప్యూటీ తహాశీల్థార్ ఎఎస్ఆర్ గోపాలరెడ్డి, వై రామయ్య (టిడిపి), తరుణ్ కాకాని (బీజేపీ), బి. పుష్పరాజ్ (బిఎస్పి) బొర్రా కిరణ్ (ఐఎన్సి), ఎస్.అనిల్‌చంద్ (ఐఎన్సి) పాల్గొన్నారు.