ఎన్‌టీఆర్ జిల్లా, జులై 02, 2025
దార్శనిక ప్రణాళికలపై స్పష్టమైన అవగాహన ఉండాలి
- నియోజకవర్గ బలాలు, బలహీనతల విశ్లేషణ కీలకం
- వృద్ధికి అవకాశమున్న అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి
- స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాల సాధనకు నిబద్ధతతో అడుగులేయాలి
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలోని ప్రతి అంశంపైనా స్పష్టమైన అవగాహన ఉండాలని, ఆయా నియోజకవర్గాల బలాలు, బలహీనతల విశ్లేషణ ద్వారా, వృద్ధికి అవకాశమున్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, వారి బృంద సభ్యులకు సూచించారు.
జిల్లా, నియోజకవర్గ దార్శనిక కార్యాచరణ ప్రణాళికలపై కలెక్టర్ లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎంతో కలిసి బుధవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రత్యేక అధికారులు, ప్రణాళికల రూపకల్పన బృందాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాల సాధనకు నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలు దోహదం చేస్తాయని, ఆయా నియోజకవర్గాల గ్రాస్ కన్‌స్టిట్యుయెన్సీ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీసీడీపీ)తో పాటు నియోజకవర్గ స్థూల విలువ జోడింపు, తలసరి ఆదాయాలను పెంచేందుకు వీటిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం దార్శనిక ప్రణాళికల లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న రూ. 3.52 లక్షల జిల్లా తలసరి ఆదాయాన్ని 2047 నాటికి రూ. 55 లక్షలకు చేర్చాలనేది లక్ష్యమని.. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే స్పష్టమైన ప్రణాళికలతో పాటు వాటి అమలుకు ప్రతిఒక్కరూ సమష్టిగా కృషిచేయాల్సిన అవసరముందన్నారు. ఉదాహరణకు పశు పోషణ రంగంలో అధిక వృద్ధికి అవకాశముందని.. ఈ నేపథ్యంలో ఓ నియోజకవర్గంలో ప్రస్తుత పాల ఉత్పత్తి, పాల ఉత్పత్తిని పెంచడానికి ఉన్న అడ్డంకులు, వాటిని అధిగమించేందుకు అందుబాటులో ఉన్న పథకాలు, వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా జరిగే అదనపు సంపద సృష్టి.. ఇలా ప్రతి అంశంపైనా స్పష్టమైన అవగాహన ఉండాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో సేవా రంగంపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరముందని.. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పశు పోషణ, ఉద్యాన, ఆక్వా కల్చర్, పరిశ్రమలు తదితరాలపై దృష్టిపెట్టాల్సిన అవసరముందని సూచించారు.
బంగారు కుటుంబానికి పీ4తో ఉన్నత భవిష్యత్తును నిర్మిద్దాం: రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఎక్కడాలేని విధంగా వినూత్నంగా పీ4 విధానాన్ని అమలుచేస్తోందని.. ఈ విధానాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు కృషిచేయాలని సూచించారు. దశల వారీగా అభివృద్ధి ప్రణాళికలను అమలుచేయడం ద్వారా బంగారు కుటుంబాలను పేదరికం నుంచి బయటపడేలా చేయొచ్చని, ఇందుకు మార్గదర్శులను ప్రోత్సహించాలని సూచించారు. కేవలం డబ్బే కాకుండా ఓ మంచి సూచన, చేయిపట్టి నడిపించే సేవా తత్పరత, సమాజం మనకెంతో ఇచ్చింది.. మనమూ సమాజానికి తిరిగి ఎంతో కొంత చేయాలనే మంచి ఆలోచనలు.. బంగారు కుటుంబాల అభివృద్ధికి ఉపయోగపడతాయని వివరించారు. తాజాగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు రోటరీ క్లబ్ సభ్యులు ముందుకొచ్చారని.. ఇదే స్ఫూర్తితో మిగిలిన వారు ఓ మంచి చొరవలో భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.
సమావేశంలో సీపీవో వై.శ్రీలత, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.