ఎన్‌టిఆర్ జిల్లా తేది:07.08.2025
దసరా మహోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయండి.
జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
దసరా మహోత్సవాలకు శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
సెప్టెంబర్ 22 నుండి నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు దుర్గ గుడి అధికారులు చేపడుతున్న ముందస్తు ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, ఆలయ కార్యనిర్వాహణాధికారి వి.కె. శీనానాయక్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి దుర్గా ఘాట్, జాతీయ రహదారి, మహా మండపం, కనకదుర్గ నగర్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
ఈసందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని, చేస్తున్న ఏర్పాట్ల పై అధికారులకు పలు సూచనలు చేశారు. గత ఉత్సవాలలో భక్తులకు ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పునరావృతం కాకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. మహా మండపం వద్ద ప్రసాదం క్యూ లైన్లను పరిశీలించి భక్తులకు అవసరమైన ప్రసాదాలను అందుబాటులో ఉండేలా చూడాలని ప్రసాదాల నాణ్యత, క్యూ లైన్ల వద్ద పరిశుభ్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ నిషేదాన్ని ప్రకడ్భందిగా అమలు చేయాలని ఆదేశిస్తూ ప్రస్తుతం ఉన్న ప్రసాదం కౌంటర్లను, విక్రయిస్తున్న కవర్లను తనిఖీ చేసి బయోడిగ్రేడబుల్ కవర్లను విక్రయిస్తున్నందుకు కలెక్టర్ సంతోషం వ్యక్తం చేసారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన ముందస్తు భద్రతా ఏర్పాట్లను చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, ప్రసాదం పంపిణీ ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులకు సూచించారు.
ఆలయ కార్యనిర్వాహణాధికారి వి.కె. శీనానాయక్ ఈ ఏడాది కనకదుర్గ నగర్ నందు 10 ప్రసాదం కౌంటర్లతో పాటు అదనంగా 8 చోట్ల మొత్తంగా 18 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా ఆలయ పరిధి, వివిధ ప్రదేశాలలో 250కు పైగా సిసి కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసందానించి పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్‌కు వివరించారు.
పరిశీలనలో కలెక్టర్ వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.వి.ఎస్‌ఆర్ కోటేశ్వరరావు, డిఇలు రవీంద్ర, అశోక్‌లు ఉన్నారు.