ఎన్‌టీఆర్ జిల్లా, జులై 29, 2025
దసరా ఉత్సవాల విజయవంతానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం
- ఉత్సవాల నిర్వహణలో అధికారులు సమన్వయం కీలకం
- సామాన్య భక్తుల సంతృప్తికే తొలి ప్రాధాన్యత
- సాంకేతికత, ఏఐ టూల్స్ వినియోగానికి సన్నద్ధం
- భక్తులకు మధురానుభూతి కలిగించేలా ఈ ఏడాది దసరా ఉత్సవాలు
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు
ఇంద్రకీలాద్రిపై గతేడాది దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు విజయవంతాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరింత మిన్నగా సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యతనిస్తూ ప్రణాళిక ప్రకారం భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి సాంకేతికత, ఏఐ టూల్స్ అనుసంధానంతో భక్తులకు మధురానుభూతి కలిగించేలా ఈ ఏడాది దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబులు తెలిపారు.
సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజులపాటు జరగనున్న దసరా ఉత్సవాలపై కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధ్యక్షతన కలెక్టరేట్‌లో సమన్వయ శాఖల అధికారుల సమావేశం జరిగింది. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల ఆలయ ఈవో వీకే శీనానాయక్ తదితరులు హాజరైన సమావేశంలో రెవెన్యూ, దేవాదాయ, పోలీస్, వీఎంసీ, పౌర సరఫరాలు, వైద్య ఆరోగ్యం, విద్యుత్, రవాణా, ఆర్ అండ్ బీ, సమాచార, పౌర సంబంధాలు తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, అమ్మవారి అలంకరణలు, భక్తుల క్యూలైన్లు, బ్యారికేడింగ్, ఆన్‌లైన్, కరెంట్ బుకింగ్ కౌంటర్లు, పార్కింగ్, మంచి నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఘాట్ల వద్ద షవర్ల ఏర్పాటు, భద్రతా వ్యవస్థ, ప్రసాదాల తయారీ, పంపిణీ, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్, వైద్య శిబిరాలు, పాస్‌ల జారీ, సూచిక బోర్డుల ఏర్పాటు తదితరాలపై చర్చించి.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మీడియాతో మాట్లాడుతూ ఏటా దసరా ఉత్సవాలకు విజయవాడ వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోందని.. ఈ ఏడాది రోజుకు దాదాపు లక్ష మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశముందని.. అదేవిధంగా మూలా నక్షత్రం రోజున దాదాపు 1,50,000 నుంచి రెండు లక్షల వరకు భక్తులు రావొచ్చన్నారు. రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారని.. ఎంతమంది నగరానికి వచ్చినా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. నిరంతర పర్యవేక్షణకు 24 గంటలూ సేవలందించే కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని.. ప్రతి శాఖ నుంచి ఒక అధికారి ఈ కంట్రోల్ రూమ్‌లో ఉంటారన్నారు. ఉత్సవాల రోజుల్లో ప్రత్యేక లక్ష కుంకుమార్చన, చండీహోమం తదితర విశేష పూజా కార్యక్రమాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. భక్తులకు కల్పించిన ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం జరుగుతుందన్నారు. క్యూ లైన్లు, లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం, పారిశుద్ధ్యం, తాగునీరు.. ఇలా ప్రతి అంశంపైనా ప్రత్యేక దృష్టిపెట్టనున్నట్లు తెలిపారు. దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ నేపథ్యంలో అవసరం మేరకు ఇతర జిల్లాల సిబ్బంది సేవలను కూడా వినియోగించనున్నట్లు వెల్లడించారు. సమన్వయ శాఖల అధికారుల కీలక భాగస్వామ్యంతో దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేందుకు సమష్టిగా కృషిచేయాల్సిన అవసరముందని, సెప్టెంబర్ 20 నాటికే అన్ని ఏర్పాట్లను పూర్తిచేసి, సర్వసన్నద్ధంగా ఉండాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
డ్రోన్లు, సీసీ కెమెరాలతో పటిష్ట పర్యవేక్షణ: సీపీ రాజశేఖరబాబు
గతేడాది దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించామని, ఆ సమయంలో గుర్తించిన చిన్నచిన్న లోపాలను సరిదిద్ది ఈ ఏడాది కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గట్టి ఏర్పాట్లు చేసి విజయవంతం చేయనున్నట్లు సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు పేర్కొన్నారు. గతేడాది మూడు నాలుగు డ్రోన్లు మాత్రమే ఉన్నాయని.. ఈసారి 42 డ్రోన్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో దాదాపు అయిదు వేల సీసీ కెమెరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ-డిప్లాయ్‌మెంట్ యాప్‌తో పాటు అస్త్రం ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ యాప్ వంటివి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ట్రాఫిక్, పార్కింగ్ పరంగా ఇబ్బందిలేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ ఉత్సవ్ కూడా జరగనున్న నేపథ్యంలో వచ్చే 50 రోజులుపాటు సమన్వయ సమావేశాలు, క్షేత్రస్థాయి సందర్శనలతో ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషిచేయనున్నట్లు రాజశేఖరబాబు తెలిపారు.
భక్తుల మనోభావాలకు అనుగుణంగా: ఈవో వీకే శీనానాయక్
ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రభుత్వ మార్గదర్శకాలు, కలెక్టర్ వారి నేతృత్వంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు
ఆలయ కార్యనిర్వహణ అధికారి వీకే శీనానాయక్ తెలిపారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఉత్సవాల నిర్వహణకు సమన్వయ శాఖల అధికారులతో కలిసి కృషిచేయనున్నట్లు శీనా నాయక్ పేర్కొన్నారు.
సమావేశంలో ఆలయ స్థానాచార్యులు వి.శివ ప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్.దుర్గాప్రసాద్, డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, డీసీపీ కేజీవీ సరిత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.