ఎన్టీఆర్ జిల్లా, జులై 16, 2025
దళారీ వ్యవస్థను సహించేది లేదు..
- రైతుబజార్లలో అవకతవకల ఆనవాళ్లు కనిపిస్తే కఠిన చర్యలు
- పూర్తి పారదర్శకతతో వినియోగదారులకు సేవలందించాల్సిందే
- గాంధీనగర్ రైతుబజార్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
రైతుబజార్లలో దళారీ వ్యవస్థతో పాటు ఎలాంటి అవకతవకల ఆనవాళ్లు కనిపించినా సహించేది లేదని.. పూర్తి పారదర్శకతతో వినియోగదారులకు రైతు బజార్లు సేవలందించాల్సిందేనని, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ హెచ్చరించారు.
బుధవారం ఉదయం కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ గాంధీనగర్ సాంబమూర్తి రోడ్డు రైతు బజార్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూరగాయల విక్రయ స్టాళ్లను పరిశీలించి, ధరల పట్టికలను పరిశీలించారు. వినియోగదారులతో మాట్లాడి రైతు బజారు ద్వారా అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎస్టేట్ అధికారి విధుల్లో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. దివ్యాంగ కేటగిరీలో ఓ వ్యక్తికి స్టాల్‌ను కేటాయించగా ఆ స్టాల్లో వేరొకరు ఉండటంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ.. రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలను నిర్దేశ రేట్ల ప్రకారం అందించాలని, స్లాళ్ల నిర్వాహకులు వినియోగదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. ఎవరికి కేటాయించిన స్టాళ్లను వారే నిర్వహించాలని, మధ్యవర్తులు, దళారులు తిష్ట వేస్తే సహించేది లేదని, రైతు బజార్ల స్ఫూర్తికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. స్టాల్‌ను ఏ కేటగిరీ కింద కేటాయించారు? ఎవరికి కేటాయించారు? తదితర వివరాలుతో కూడిన బోర్డును స్టాల్లో ప్రదర్శించాల్సిందేనని, కూరగాయల ధరల వివరాల బోర్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం కనిపించినా, రైతు బజార్ల సేవల విషయంలో పారదర్శకత లోపించినా ఎస్టేట్ అధికారులను సస్పెండ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. రైతు బజార్లు లోపల, బయట ఎక్కడ పాలిథీన్ సంచులు కనిపించినా అందుకు ఎస్టేట్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, వినియోగదారులు క్లాత్ లేదా జ్యూట్ బ్యాగులు ఉపయోగించేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. ప్లాస్టిక్ విచ్చలవిడి వినియోగంతో పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుందని, ప్లాస్టిక్ వినియోగం దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులకు సూచించారు.