ఎన్టిఆర్ జిల్లా తేది:07.08.2025
తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007 పై అవగాహన కల్పించాలి.
వయోవృద్ధుల సంరక్షణ భాధ్యతను విస్మరిస్తే చట్టపరమైన చర్యలు.జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
వయోవృద్ధుల సంరక్షణ భాధ్యత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.
స్థానిక కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో గురువారం విభిన్న ప్రతిభావంతుల హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం, 2007, తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల పోషణ మరియు సంరక్షణ నియమావళి 2011 పై జిల్లా స్థాయి అధికారులకు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వయోవృద్ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ చట్టం పై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండడంతో పాటు సంబంధిత కార్యాలయ సిబ్బందికి కూడా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పౌరుడు వారి తల్లిదండ్రులను, పోషణను చూడవలసిన భాధ్యత ఉందన్నారు. వయోవృద్దులు ఎవరైన కార్యాలయాలకు వస్తే వారికి సరైన మార్గదర్శకం చూపించాలన్నారు. చాలా కుటుంబాల్లో నేటికి వృద్ధులు నిర్లక్ష్యానికి, అగౌరవానికి, అబద్రతకు గురవుతున్నారని, ఇటువంటి దుస్థితిని నివారించడానికి ప్రభుత్వం విప్లవాత్మకమైన ప్రత్యేక చట్టాన్ని రూపొందించిందన్నారు. వయోవృద్దులకు చట్టం కల్పించిన హక్కులను వారికి అందేలా జిల్లా అధికారులు కృషి చేయాలన్నారు. చట్టంలో రూపొందించిన విధంగా సెక్షన్ 23 ప్రకారం తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవచ్చు మరియు సెక్షన్ 24 ప్రకారం తల్లిదండ్రుల సంరక్షణను న్లింక్ష్యం చేస్తే 3 నెలల జైలు శిక్ష మరియు 5 వేల రూపాయల జరిమానా కూడా విధించబడుతుందన్నారు. కొడుకు లేదా కూతురు తమ ఆస్తులను తమ పేర్ల పై వ్రాయించుకుని తల్లిదండ్రుల బాగోగులు పటించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతులను సమర్పిస్తుంటారని, సమాజంలో ఇటువంటి సంఘటనల పట్ల స్పందిస్తు వారికున్న హక్కులను చట్టాలను అధికారులు వారికి తెలియజేయవలసి ఉంటుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
కార్యక్రమంలో ముందుగా హెరిటేజ్ ఫౌండేషన్ ప్రాజెక్టు హెడ్ టి. రవి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చట్టం పై అధికారులకు అవగాహన కల్పించారు.
అవగాహన కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ ఏడి వి. కామరాజు, జడ్పీ సీఈవో కన్నమనాయుడు, మున్సిపల్ కమిషనర్లు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.