ఎన్‌టీఆర్ జిల్లా, జులై 21, 2025
డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణపై దృష్టిపెట్టండి
- మురుగునీరు సక్రమ పారుదలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి
- రోడ్లపై వర్షపు నీరు నిలిచే పరిస్థితి ఎక్కడా ఉండకూడదు
- ఇంజనీరింగ్ లోపాలు లేకుండా చూడాలి
- స్వచ్ఛత, సీజనల్ వ్యాధులపై ప్రజలకూ అవగాహన కల్పించాలి
- వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ నగర పరిధిలో డ్రైనేజీ వ్యవస్థపై దృష్టిపెట్టాలని, నిర్వహణ పరంగా ఎక్కడా లోపాలు ఉండటానికి వీల్లేదని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులకు స్పష్టం చేశారు.
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు కలెక్టర్ లక్ష్మీశ సోమవారం వివిధ ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ముందు పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు, నిర్మల్ కాన్వెంట్ రోడ్డు, వన్‌టౌన్ లో బ్రిడ్జ్ ప్రాంతాలను పరిశీలించగా.. పీజీఆర్ఎస్ కార్యక్రమం ముగిసిన అనంతరం దేవీనగర్, న్యూ రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పారిశుద్ధ్యం, సక్రమ మురుగునీటి పారుదల, రక్షిత తాగునీరు అనేవి ప్రజల ఆరోగ్య భద్రతకు చాలా కీలకమని డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకుంటే మురుగునీరు రోడ్లపైకి చేరడంతో దుర్వాసనతో పాటు దోమలు పెరిగి ప్రజలు డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి విష జ్వరాల బారినపడే ప్రమాదముందన్నారు. వరద, మురుగునీటి కాల్వల్లో ఎక్కడా అడ్డంకులు ఉండటానికి వీల్లేదని, ఒకవేళ ఏదైనా సమస్య ఏర్పడితే యుద్ధప్రాతిపదికన సమస్యను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కాలువ ప్రారంభం నుంచి చివరి వరకు పూడికలు అనేవి లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా వర్షపు నీరు కూడా ఎక్కడా రోడ్లపై నిలిచిపోకుండా చూడాలని, వాహనదారులకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నగర రహదారుల్లో ఇంజనీరింగ్ లోపాలు లేకుండా చూడాలన్నారు. ఈ వర్షాకాలంలో ఎక్కడైనా నీళ్లు నిలిచినా, డ్రైనేజీ సమస్య ఉన్నా 91549 70454 నంబరుకు ఫోన్‌చేసి సమాచారమివ్వాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
సామాజిక స్పృహే మనకు, మన కుటుంబానికి రక్ష:
చెత్తాచెదారాన్ని, ప్లాస్టిక్ వస్తువులు వంటి వాటిని కాలువల్లోకి నెడితే తిరిగి ఆ చెత్తే అంతులోని అనారోగ్యాల రూపంలో మన నెత్తినపడుతుందని.. వ్యర్థాలను సరైన విధంగా వేరుచేసి, పారిశుద్ద్య సిబ్బందికి ఇవ్వడం, పాలిథీన్ కవర్లు వంటివాటిని వాడకుండా, ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయ వస్తువులను ఉపయోగించేలా అవగాహన కల్పించాలని, సామాజిక స్పృహ, క్రమశిక్షణ మనల్ని, మన కుటుంబాలను, సమాజానికి రక్ష అనే విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలని పేర్కొన్నారు. ఆరోగ్య ఆంధ్ర సాకారానికి జరుగుతున్న మహా యజ్ఞంలో ప్రతిఒక్కరూ భాగం కావాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయకుండా చూడాలని.. యజమానులకు నోటీసులు పంపి, మొక్కలు నాటేలా చూడాలని ఆదేశించారు.
కలెక్టర్ వెంట విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ ఇంజనీర్ ఆర్.శ్రీనాథ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.సామ్రాజ్యం, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డా. అన్నపూర్ణ తదితరులు ఉన్నారు.