
విజయవాడ, తేదీ: 18.11.2025
• డ్రగ్స్ వద్దు బ్రో….. నినాదం ప్రతి విద్యార్థి నుండి వినపడాలి
• డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
• డ్రగ్స్ రహిత దేశ, రాష్ట్ర సాధనే లక్యం
సిఐఐ విశాఖ వేదిక ద్వారా 13లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 13 లక్షల ఉద్యోగాల కల్పనగా యంవోయూలు……
- రాష్ట్ర సాంఘిక సంక్షేమం, విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం లో భాగంగా కేంద్ర సామాజిక న్యాయ సంఘం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో చేపట్టిన “నశాముక్త భారత్ అభియాన్” కార్యక్రమం విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమం, విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక దేవయ్య ఆడిటోరియం లో అవగాహనా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమం, విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి మరియు విజయవాడ తూర్పు శాసనసభ సభ్యులు గద్దె రామ్మోహన్ రావు, ఈగల్ ఎస్పి కేఎస్ నగేష్ తదితరులు హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమం, విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ సమాజంలో యువత చెడు వ్యసనాలకు బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకోకూడదు అనే సంకల్పంతో ఈగిల్ అనే ఒక నూతన వ్యవస్థని రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈగిల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అని, ఈ వ్యవస్థ నార్కోటిక్స్ మరియు గంజాయి వంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టడానికి పోలీస్, ఎక్సైజ్, విద్యా శాఖ మరియు నశాముక్త డి అడిక్షన్ వంటి విభాగాలను ఒకటిగా సమీకృతం చేసి ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ వ్యవస్థ మత్తు పదార్థాలు ఉత్తరాంధ్రలో అధికంగా సాగుచేసే ప్రాంతాలను డ్రోన్స్ ద్వారా గుర్తించి గంజాయి పంటని నిర్వీర్యం చేయడం జరిగిందని, రాష్ట్రంలో దాదాపుగా గంజాయి పంటని పండించే వారికీ అవగాహన కల్పించి వారికీ ప్రత్యామ్నాయ పంటలు పండించే విధంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు.
అంతే కాకుండా మన చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడైనా గంజాయి మొక్కలు పెంచుతున్నట్లయితే తక్షణమే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, సమాచారం ఇచ్చినందుకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందజేస్తుందని తెలిపారు. గంజాయిని లిక్విడ్, చాక్లెట్ , సిగరెట్ రూపాలలో తరలిస్తున్నారని విద్యాసంస్థల పరిసరాలలో మాదక ద్రవ్యాలను గుర్తించి వాటిని సరఫరా చేసిన వారికీ కఠిన శిక్షలు అమలయ్యేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం మాదక ద్రవ్యాల నివారణకు తీవ్రంగా కృషి చేస్తున్నదని, పోలీసులు మాత్రమే కాకుండా పోలీస్ జాగిలాలకు కూడా ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి టన్నుల కొలది నార్కోటిక్ డ్రగ్స్ ని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఈ నశాముక్త భారత్ అభియాన్ ద్వారా అవగాహన కల్పించడంతో పాటు వీటికి బానిసైనటువంటి వాళ్లకి డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ లను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసిందని ఎవరైతే మత్తు పదార్థాలకి చివరికి ఆల్కహాల్ కి బానిసలువుతారో వారిని అందులో అడ్మిట్ చేసి వాళ్లకి కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ఇచ్చి సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, అంతే కాకుండా జైల్లో కూడా నేర ప్రవృత్తి కలిగి ఎవరైతే డ్రగ్ ఎబ్యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళును కూడా మార్చాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా మన రాష్ట్రంలోనే నాలుగు డి అడిక్షన్ సెంటర్లని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు.
ఈరోజు యువత చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని, మాదక ద్రవ్యాలకు బానిసైన తర్వాత సమాజంలో తోటి విద్యార్థులే చిన్న చూపు చూస్తారని, కుటుంబ సభ్యుల తిరస్కరానికి కూడా గురి కావాల్సిన పరిస్థితి వస్తుందని కాబట్టి విద్యార్థులు తమ కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడెలా ఉండాలని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంది ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలని విద్యార్థులకు సూచించారు. విశాఖపట్నంలో జరిగిన సిఐఐ సమ్మిట్ ద్వారా 13.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో పాటు 13 లక్షల ఉద్యోగాలకి ఎంఓయు చేసుకుని యువతను మరింత ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రమిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా మరియు ఐటి శాఖ మాత్యులు నారా లోకేష్, హోం మంత్రి అనిత తదితర మంత్రులు కూడా డ్రగ్స్ వద్దు బ్రో అని ఈ విషయం మీద ప్రత్యేకమైన క్యాంపెయిన్ చేస్తున్నారని, భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి దేశానికి సమాజానికి ఉపయోగపడే ఒక శక్తిగా, ఒక సంకల్పంగా యువత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని, ఈరోజు నశాముక్త భారత్ అభియాన్ ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేసారు.
అనంతరం విజయవాడ తూర్పు శాసన సభ సభ్యులు గద్దె రామ్మెహన్ మాట్లాడుతూ యువత శక్తి నిర్వీర్యం కాకుండా మాదక ద్రవ్యాల నుండి భవిష్యత్తు తరాలను కాపాడాలనే ఉద్దేశ్యంతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నశాముక్త భారత్ అభియాన్ అవగాహన సదస్సులో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. నేడు ప్రపంచ పటంలో భారత దేశం అభివృద్ధి చెందిన దేశంగా అగ్రస్థానంలో నిలబడటానికి కారణం మన ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉపముఖ్యమంత్రి వర్యులు కూటమిగా ఏర్పడి రాష్ర్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారన్నారు. ఏ దేశానికైనా తిరుగులేని సంపద యువత అని, అలాంటి యువశక్తి ని మాదక ద్రవ్యాల బారిన పడకుండా నశాముక్త భారత్ అభియాన్ ద్వారా ఎన్నో అవగాహనా కార్యక్రమాలు చేపట్టి ఒక తపస్సులా యువతను రక్షించడానికి, మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమిస్తున్నాయన్నారు.
ఈగల్ ఎస్పి కేఎస్ నగేష్ మాట్లాడుతూ డ్రగ్స్ అనే మహమ్మారిని రాష్ట్రం నుండి దేశం నుండి పారద్రోలాలని, యువతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈగల్ లో మాదక ద్రవ్యాలను అరికట్టడానికి అనేక కార్యక్రమాలను చేపట్టామని గంజాయి పండించడాన్ని పూర్తిగా అరికట్టామని దీని ఫలితమే నేడు రాష్ట్రం జీరో కల్టివేషన్ రాష్ట్రంగా చేశామని తెలిపారు. విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి మాదక ద్రవ్యాల ఉత్పత్తులు అందుబాటులో లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. అలాగే డ్రగ్స్ కి సంబంధించిన ఏ విషయమైనా 1972 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయాలనీ, త్వరలో మన రాష్ర్టం డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మారాలని పేర్కొన్నారు.
అనంతరం సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి విద్యార్థులతో రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు దృఢమైన సంకల్పం తీసుకుంటున్నామంటూ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమానికి డిసేబుల్డ్ అండ్ నశాముక్త భారత్ అభియాన్ డైరెక్టర్ రవి ప్రకాష్ రెడ్డి, నశాముక్త భారత్ స్టేట్ లెవెల్ కోఆర్డినేటర్ ఉమా రాజ్ మరియు రాష్ట్ర సాంఘిక సంక్షేమం, విభిన్న ప్రతిభావంతుల విభాగ అధికారులు మరియు పలు విద్యాసంస్థల నుండి విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
![]()
