ఎన్టీఆర్ జిల్లా/విజయవాడ రూరల్, ఆగస్టు 07, 2025
జిల్లాలో సమృద్ధిగా ఎరువులు, పురుగుమందులు
- కొరత అనే మాటకు ఆస్కారం లేకుండా నిరంతర పర్యవేక్షణ
- అవకతవకలకు తావులేకుండా ముమ్మర తనిఖీలు
- నానో ఎరువుల వినియోగంతో బహుళ ప్రయోజనాలు
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
జిల్లాలో ఖరీఫ్ పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని.. కొరత అనే మాటకు ఆస్కారం లేకుండా ప్రత్యేక బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
గురువారం కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ రూరల్ మండలం, నున్నలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లిమిటెడ్ను సందర్శించారు. రైతులకు ఎరువుల సరఫరా స్థితిగతులను పరిశీలించారు. ఈ-పోస్ మెషీన్ పనితీరును పరిశీలించడంతో అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూడు నాలుగు నిమిషాల్లోనే ఈ-పోస్ ద్వారా బయోమెట్రిక్ ధ్రువీకరణతో ఎరువులు సరఫరా చేస్తుండటంపై రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారమే మరో లోడ్ ఎరువులు వచ్చాయని.. ఎరువులు పరంగా ఇబ్బంది లేదని తెలిపారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ శ్రీరామ ఎంటర్ప్రైజెస్ ఎరువులు, పురుగుమందులు, విత్తనాల దుకాణాన్ని, గోదామును తనిఖీ చేశారు. ఫిజికల్, ఆన్లైన్ రికార్డులతో పాటు లావాదేవీలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో 5,403 మెట్రిక్ టన్నుల యూరియా, 2,251 మెట్రిక్ టన్నుల డీఏపీ, 1,052 మెట్రిక్ టన్నుల ఎంవోపీ, 2,310 మెట్రిక్ టన్నుల ఎస్ఎస్పీ, 12,292 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్.. ఇలా మొత్తం 23,310 మెట్రిక్ టన్నులు ఎరువులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకే ఎరువులను సరైన విధంగా వినియోగించాలని.. ఇష్టమొచ్చినట్లు వినియోగించవద్దని రైతులకు సూచించారు. నానో ఎరువుల వినియోగంతో బహుళ ప్రయోజనాలున్నాయని.. నానో యూరియా, నానో డీఏపీ వంటి వాటిని ఉపయోగించడం వల్ల పంట నాణ్యత, ఉత్పత్తి పెరగడంతో పాటు నేల, గాలి, నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుంటుందన్నారు. సంప్రదాయ ఎరువుల కంటే తక్కువ ధరలోనే ఇవి లభ్యమవుతాయని, చాలా తేలిగ్గా స్ప్రే చేయొచ్చని వివరించారు. ఎరువుల సరఫరాపై అప్రమత్తంగా ఉన్నామని, క్షేత్రస్థాయిలో ఆర్డీవోలు, తహసీల్దార్లు తనిఖీలు చేస్తున్నారని పేర్కొన్నారు. కృత్రిమ కొరతను సృష్టించడం, ఎరువులను అధిక ధరలకు అమ్మడం, అడిగిన ఎరువును కాకుండా వేరే ఎరువును ఇవ్వడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎరువులు, పురుగు మందులపై ఫిర్యాదులు లేదా సమాచారం అందించేందుకు కలెక్టరేట్లో 91549 70454 నంబరుతో కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉందని, వదంతులను నమ్మవద్దని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ కె.నాగమల్లిక తదితరులు ఉన్నారు.