జిల్లాను పారిశ్రామిక హ‌బ్‌గా తీర్చిదిద్దుతాం..

Spread the love

ఎన్‌టీఆర్ జిల్లా, న‌వంబ‌ర్ 11, 2025

జిల్లాను పారిశ్రామిక హ‌బ్‌గా తీర్చిదిద్దుతాం..

  • ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ఫ్లాటెడ్ ఫ్యాక్ట‌రీ కాంప్లెక్సులు
  • నియోజ‌క‌వ‌ర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు
  • వ‌న్ ఫ్యామిలీ-వ‌న్ ఆంత్ర‌ప్రెన్యూర్ దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు
  • విస్తృత ఉపాధి అవ‌కాశాల సృష్టికి ప్ర‌భుత్వ కొత్త చొర‌వ‌
  • ఔత్సాహికులు స‌ద్వినియోగం చేసుకోవాలి
  • జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు

స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ దిశ‌గా చేస్తున్న ప్ర‌యాణంలో జిల్లాను పారిశ్రామిక హ‌బ్‌గా తీర్చిదిద్దేందుకు ప్ర‌జాప్ర‌తినిధుల భాగ‌స్వామ్యంతో కృషిచేస్తున్నామ‌ని.. ప్ర‌తి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాల‌నేది ముఖ్య‌మంత్రి ఆకాంక్ష అని.. ఈ ల‌క్ష్య సాధ‌న‌కు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల‌తో పాటు ఫ్లాటెడ్ ఫ్యాక్ట‌రీ కాంప్లెక్సు (ఎఫ్ఎఫ్ఎస్‌)ల‌ను అభివృద్ధి చేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు అన్నారు.
మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో వాంబే కాల‌నీ ప్రాంతంలో రూ. 13.78 కోట్ల‌తో ఏర్పాటుకానున్న ఫ్లాటెడ్ ఫ్యాక్ట‌రీ కాంప్లెక్సుకు క‌నిగిరి నుంచి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు.. స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో క‌లిసి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు రూ. 42 కోట్ల‌తో విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, మైల‌వ‌రం నియోజ‌క‌వర్గాల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్ట‌రీ కాంప్లెక్సులతో పాటు జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుకు ముఖ్య‌మంత్రి వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాప‌న చేశార‌న్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తికి అనుగుణంగా వీటిని త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు తెలిపారు. త‌క్కువ పెట్టుబ‌డితో పారిశ్రామిక యూనిట్ల‌ను స్థాపించి త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డ‌ట‌మే కాకుండా ప‌ది మందికి ఉపాధి క‌ల్పించే స్థాయికి మ‌హిళ‌లు, యువ‌త ఎద‌గాల‌నే ల‌క్ష్యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అడుగులు వేస్తుంద‌న్నారు. పారిశ్రామిక వికేంద్రీక‌ర‌ణ‌కు, స‌మ్మిళిత‌, సుస్థిర అభివృద్ధికి ఫ్లాటెడ్ ఫ్యాక్ట‌రీ కాంప్లెక్సులు, ఎంఎస్ఎంఈ పార్కులు వేదిక‌లుగా నిలుస్తాయ‌న్నారు. అత్యంత నాణ్య‌మైన మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న జ‌ర‌గ‌నుంద‌ని.. వీటిని ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు.
స‌ద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు
ముఖ్యంగా స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌లు ర‌డీమేడ్ గార్మెంట్స్ త‌యారీవంటి పారిశ్రామిక యూనిట్లు ఈ ఫ్యాక్ట‌రీ కాంప్లెక్సులో ఏర్పాటు చేసుకోవ‌చ్చ‌ని.. ఇక్క‌డ ఎంఎస్ఎంఈ యూనిట్ల‌తో పాటు అంత‌ర్గ‌త సీసీ ర‌హ‌దారులు, ప‌టిష్ట డ్రెయినేజీ, నీటి స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌, పార్కింగ్ ప్రాంతం ఇలా వివిధ వ‌స‌తులు కూడా అందుబాటులో ఉంటాయ‌న్నారు. విజ‌య‌వాడ అర్బ‌న్ క్ల‌స్ట‌ర్‌లో కీల‌క ప్రాంతంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సు వ‌చ్చినందుకు చాలా ఆనందంగా ఉంద‌ని.. దీన్ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక చేయూత కూడా ల‌భిస్తుంద‌న్నారు. ప్ర‌తి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాల‌నే ఉద్దేశంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో కృషిచేస్తోంద‌ని శాస‌న‌స‌భ్యులు బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు పేర్కొన్నారు.
కార్య‌క్ర‌మంలో రాష్ట్ర నాగ‌వంశం సంక్షేమ, అభివృద్ధి కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ ఎరుబోతు ర‌మ‌ణారావు, కార్పొరేట‌ర్ కంచిదుర్గ‌, జిల్లా ప‌రిశ్ర‌మ‌ల అధికారి పి.మ‌ధు, ఏపీఐఐసీ డిప్యూటీ జోన‌ల్ మేనేజ‌ర్ జి.జ్యోతి, స్థానిక ప్ర‌జ‌లు, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Loading