జిల్లాకు మంజూరైన అభివృద్ధి, నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసేబాధ్యత అధికారులపై ఉంది మీ

2
0

జిల్లాకు మంజూరైన అభివృద్ధి, నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసేబాధ్యత అధికారులపై ఉంది

మంజూరైన పనులు గ్రౌండింగ్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి

*జిల్లాలో గుంతల మరమ్మత్తు పనులు జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలి*

*అందరూ కలిసికట్టుగా పనిచేసి జిల్లాను రాష్ట్రంలో మొదటి మూడు స్థానాలలో నిలిచేలా  అధికారులు పనిచేయాలి: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జి  మంత్రి నాదెండ్ల మనోహర్*

               ఏలూరు, జనవరి, 16:   ఏలూరు జిల్లాను అభివృద్ధి లో రాష్ట్రస్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిపేందుకు అధికారులందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జి  మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో గురువారం జిల్లా సమీక్షా కమిటీ సమావేశం జిల్లా ఇంచార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగింది.  సమావేశంలో   రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచారపౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన అభివృద్ధి, నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేసి, వినియోగంలోకి తీసురావాలన్నారు. జిల్లాలో గుంతలు మరమ్మత్తు పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలనీ, రోడ్ల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు.  మార్చి నెలాఖరులోగా నిధులు ఖర్చుచేయవలసి ఉన్న దృష్ట్యా  అభివృద్ధి పనులకు సంబంధించి అంచనాలు రూపొందించిన దగ్గర నుండి, టెండర్లు, పనులు పూర్తి అయ్యేవరకు అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవలసిన  బాధ్యత అధికారులపై ఉందన్నారు,. పోలవరం ప్రాజెక్ట్ కు భూములకు అందించిన నిర్వాసితులకు సంబందించిన సమస్యల పరిష్కారానికి ఆయా గ్రామాలలో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలన్నారు.  జిల్లాను వ్యవసాయరంగంతోపాటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి బాటలో నిలిపేవిధంగా నియోజకవర్గ స్థాయిలో పారిశ్రామిక పార్క్ లు ఏర్పాటుచేసి ఔత్సాహిక పరిశ్రమవేత్తలతో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రతీ మండలంలోనూ అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించేందుకు ల్యాండ్ బ్యాంకు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. కొల్లేరు ప్రాంతంలోని పేదప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ముఖ్యంగా త్రాగునీరు, రోడ్లు, వంటి మౌలిక సదుపాయాలు వంటి సమస్యలను పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలన్నారు.  దీపం పథకంలో అర్హులైన ప్రతీ మహిళకు లబ్ది కలిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 

              రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పధకం భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో కాలువలు, డ్రైన్లు పూడికతీత పనులను కాలువలు కట్టేసి సమయానికి ప్రారంభించి, ఏప్రిల్, మే నెలాఖరు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సి ఆర్ ఎఫ్ నిధులతో చేపట్టే వట్టిగుడిపాడు- వీరవల్లి రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.  ఏలూరు జిల్లా సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలకు జిల్లాలోని శాసనసభ్యులను కూడా  ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రజలు ఎన్నో సమస్యలను తెలియజేస్తుంటారని, వాటి పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.  

             ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఎంతో అనువైన పరిస్థితులు ఉన్నాయని, వీటిని ఏర్పాటుచేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అవసరమైన వైద్య పరికరాలను  కార్పొరేట్ సామజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థలతో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానన్నారు.   వైద్యులు, వైద్య సిబ్బంది ఖాళీల భర్తీ పై చర్యలు తీసుకోవాలన్నారు.  పెదవేగి మండలంలో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధీనంలోని 350 ఎకరాలలో  పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవలసిందిగా కోరారు,. 

                జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం అందించిన రైతులకు రికార్డు సమయంలో 24 గంటలలోనే సొమ్మును రైతుల ఖాతాలకు జమ చేసారని, రైతులకు నిజమైన సంక్రాంతి కూటమి ప్రభుత్వంలోనే వచ్చిందని ధన్యవాదాలు తెలిపారు. 

            శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ  గతంలో కొల్లేరు ఆపరేషన్ సమయంలో   జిరాయితీ భూములలో  14 వేల ఎకరాలలో చెరువులను ధ్వంసం చేసారని వారికి పరిహారం అందించలేదన్నారు.   కొల్లేరు ప్రాంతంలో రోడ్లు మరమ్మత్తులకు చర్యలు తీసుకోవాలని కోరారు.  పేదలంక డ్రైన్ పై 2013 లో 3. 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జి కి అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేయని కారణంగా నిరుపయోగంగా ఉందని, అప్రోచ్ రోడ్డు నిర్మించాలని కోరారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతీ చిన్న చికిత్సకు గుంటూరుకు రిఫర్ చేస్తున్నారన్నారు.            

           ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ   శనివారపుపేట కాజ్ వే పై బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని క్యాజువాలిటీలో డాక్టర్లు రోగులకు అందుబాటులో ఉండడంలేదన్నారు.  ఏలూరు మెడికల్ కాలేజీలో హాస్టల్ నిర్మాణానికి 1. 5 ఎకరాల స్థలం మంజూరు చేయడం జరిగిందని, నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. 

 

           దెందులూరు శాసనసభ్యు;లు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కృష్ణా కెనాల్ లో వ్యర్ధాలతో కూడిన కలుషిత నీటిని ఏలూరు, దెందులూరు నియోజకవర్గాలకు త్రాగునీరుగా సరఫరా చేస్తున్నారని, దీనిని నివారించేందుకు   దెందులూరు నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అధీనంలోని నిరుపయోగంగా ఉన్న  350 ఎకరాల భూమి భూమిలో కృష్ణ కెనాల్ నీటిని కాలుష్యరహితంగా చేసే ప్రక్రియ చేపట్టాలని కోరారు. గోపన్నపాలెంలో ఉద్యానవనాలు శాఖకు చెందిన 40 ఎకరాలు నిరుపయోగంగా ఉందని, ఆ స్థలంలో పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించాలని కోరారు. ఏలూరు రూరల్ మండలం కోమటిలంక కు రోడ్డు సౌకర్యం లేదని, 6 కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణ పనులు మంజూరైనా చేపట్టలేదన్నారు. వర్షాకాలంలో రైతుల ధాన్యం తడిచిపోకుండా టార్పాలిన్లను 50 శాతంతో మంజూరు చేయాలనీ కోరారు. కొల్లేరు ఆపరేషన్ లో 14 వేల ఎకరాలలో చెరువులు కోల్పోయిన జీరాయితీ భూమిదారులకు పరిహారం అందించాలని కోరారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో జిల్లా ఎమ్మెల్యే లు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించాలని కోరారు.  ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని, గర్భీణీలకు అవసరమైన TIPA స్కాన్ యంత్రాన్ని కొనుగోలు చేయాలనీ కోరారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి రోజూ వేలాదిమంది పేద రోగులు వస్తుంటారని,  వారికోసం అన్నా కాంటీన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోకి దెందులూరు నియోజకవర్గంలోని కొంత ప్రాంతం కలిసిన దృష్ట్యా నగరపాలక సంస్థ సమావేశాలలో దెందులూరు ఎమ్మెల్యే ని కూడా ఆహ్వానించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

              కైకలూరు శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతం వరదల కారణంగా ముంపు ప్రమాదబారిన పడకుండా ఉప్పుటేరు వెడల్పు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. కొల్లేరు డ్రైనలలో తూడు, కిక్కిస, గుర్రపుడెక్క తొలగింపు పనులను ఏప్రిల్, మే నెలలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొల్లేరు పర్యావరణ పరిరక్షణకు ఎటువంటి ఆటంకం కలగకుండా కొల్లేరు ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం తీసుకోవాలని,  కొల్లేరు ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొల్లేరు అభయారణ్యం పరిధిలో నివసించే ప్రజలకు అవసరమైన త్రాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైన్లు వంటి ప్రాధమిక మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

                  ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ కొల్లేరు 5వ కాంటూర్ పరిధిలో ప్రభుత్వ, జిరాయితీ భూములకు సరిహద్దులు నిర్ణయించాలన్నారు.  కొల్లేరులో డ్రైన్లలో తూడు తొలగింపు పనులను వెంటనే చేపట్టాలన్నారు. నారాయణపురం, గణపవరం బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. 

         చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా ప్రభుత్వం మార్పు చేసిందని, కానీ కొన్ని ప్రదేశాలలో ఇంకా వాటి పేర్లను మార్చలేదన్నారు. చింతలపూడి పి హెచ్ సి లో అదనపు గదుల నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చారని, కానీ జిల్లా అధికారులు ఇంకా అనుమతులు మంజూరు చేయలేదని తెలియజేయగా, 24 గంటలలోగా అనుమతులను జారీ చేయాలనీ జిల్లా వైద్య శాఖాధికారి డా. మాలిని ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు.  పిహెచ్సి లో డాక్టర్లు, సిబ్బంది ప్రజలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా ఆసుపత్రికి దగ్గరలో క్వార్టర్స్ నిర్మించాలని కోరారు. 

              పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందన్నారు. కానీ కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లోని కొన్ని గ్రామాల్లో గత ప్రభుత్వ సమయంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకెజీ అమలులో అర్హులను సక్రమంగా నమోదు చేయలేదన్నారు. ప్రతీ గ్రామంలోనూ గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారిని గుర్తించి, వారికి కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకెజీ అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  

      

                సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. పి .ఎస్. కిషోర్,  జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి,  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here