జనసేనలోకి వైసీపీ జెడ్పీటీసీలు• కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన నలుగురు జెడ్పీటీసీలు వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కండువా కప్పి వారందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చింతలపూడి జెడ్పీటీసీ సభ్యులు పొల్నాటి శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం జెడ్పీటీసీ సభ్యులు ముత్యాల ఆంజనేయులు, అత్తిలి జెడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి, పెరవలి జెడ్పీటీసీ సభ్యురాలు కొమ్మిశెట్టి రజనీ పార్టీలో చేరారు. తాడేపల్లిగూడెం శాసన సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి ఆధ్వర్యంలో వీరంతా జనసేనలో చేరారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తమను అమితంగా ఆకట్టుకున్నాయని జెడ్పీటీసీలు చెప్పారు. ప్రజా ప్రతినిధులకు సైతం వైసీపీలో లేదని, గత మూడున్నరేళ్లుగా ఆ పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ పాల్గొన్నారు.