Home Andhra Pradesh చిన్న ఆసరా పెద్ద అండ సంక్షేమంతో పాటు.. సాయంతోనే జీరో పావర్టీ సాధ్యం

చిన్న ఆసరా పెద్ద అండ సంక్షేమంతో పాటు.. సాయంతోనే జీరో పావర్టీ సాధ్యం

3
0

చిన్న ఆసరా… పెద్ద అండ

సంక్షేమంతో పాటు.. సాయంతోనే జీరో పావర్టీ సాధ్యం

స్వచ్ఛంధంగా వచ్చిన వచ్చిన వాళ్లే మార్గదర్శులు

మార్గదర్శిగా మారిన అవనిగడ్డ పారిశుద్ధ్య కార్మికురాలు హేమలతను ప్రశంసించిన సీఎం

బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలే ముఖ్యం

జీరో పావర్టీ 2029 నాటికి సాకారం – అదే మొదటి అడుగు

ఆగస్టు 19 నుంచి పీ4 అమలు

అమరావతి, ఆగస్టు 05 : పేదరిక నిర్మూలనకు చేపడుతున్న జీరో పావర్టీ-పీ4 లక్ష్యం 2029 నాటికి సాకారం అవుతుందని.. ఇదే మొదటి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన పీ4 కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. మంగళవారం సచివాలయంలో పీ4పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ నుంచి పీ4 అమలు చేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు సీఎస్ విజయానంద్, ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, పీ4 ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఆర్ధిక, ప్రణాళిక శాఖ అధికారులు హాజరయ్యారు. సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ “పేదరిక నిర్మూలనలో భాగంగానే పీ4 కార్యక్రమాన్ని చేపట్టాం. బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యం. సమాజానికి తిరిగి ఇవ్వాలన్నదే ప్రధాన ఉద్దేశం. మార్గదర్శుల నుంచి చిన్న ఆసరా పేదలకు కొండంత అండ అవుతుంది. ఆ స్పూర్తితోనే అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు పల్లెకుంట హేమలత మార్గదర్శిగా మారి ఓ వృద్ధురాలిని ఆదుకుంటున్నారు. స్పందించే మనస్సు ఉంటే… పేదల్ని ఆదుకునేందుకు మానవత్వం చూపుతూ ముందుకు వస్తారు. డబ్బుతో పాటు.. సాయం చేసే వారు కూడా మార్గదర్శులే. బంగారు కుటంబాలకు కావాల్సింది ఎమోషనల్ బాండింగ్, చేయూత మాత్రమే. సీఎస్సార్ నిధులతో బిల్ గేట్స్, వేదాంత లాంటి సంస్థలు పనిచేస్తున్నాయి. వీటికి మించి కుటుంబాలను ఆదుకోవటమే లక్ష్యంగా పీ4 కార్యక్రమం చేపట్టాం. ప్రజలే ఆస్తిగా జీరో పావర్టీ మిషన్ అమలు చేస్తున్నాం.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మార్గదర్శుల ఎంపిక స్వచ్ఛందమే

“బంగారు కుటుంబాలను ఆదుకోవటంలో మార్గదర్శుల ఎంపిక పూర్తిగా వాలంటరీగానే జరుగుతోంది. ఎక్కడా ఎవరిపైనా బలవంతం లేదు. మార్గదర్శుల ఎంపికలో ఎక్కడా వ్యతిరేకత రాకూడదు. ఎవరినీ బలవంతం చేయొద్దు. మానవత్వం ఉండే వారే ఇందులో చేరతారు. మంచి కార్యక్రమాలను అడ్డుకునేందుకు కొందరు రాక్షసుల తరహాలో వ్యవహరిస్తారు. ప్రజల మనస్సుల్లో దీనిపై వ్యతిరేకత తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. గతంలో జన్మభూమి, శ్రమదానం, నీరు-మీరు ఇలా ఏ కార్యక్రమం చేపట్టినా ఇదే విధంగా విమర్శించారు. నేను ఇలాంటివి పట్టించుకోను. కొందరికి ఆర్ధిక వనరులు ఉన్నా పేదల్ని ఆదుకోవడానికి మనస్సు రాదు. కొందరికి మనస్సు ఉన్నా సమయం ఉండకపోవచ్చు. ఇలాంటి వారిని గుర్తించండి.. పీ4 వేదిక ఉందని చెప్పండి. ఆర్ధిక అసమానతలు మరింతగా తగ్గాలి. ఇవి పెరిగితే సమాజానికి మంచిది కాదు. ఇవాళ బంగారు కుటుంబంలో సాయం పొందిన వారే రేపు మార్గదర్శి కావచ్చు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందుకుంటూనే బంగారు కుటుంబాలకు అదనపు సాయం పీ4 ద్వారా అందుతుంది. విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు, పారిశ్రామిక వేత్తలను కలిసి వారిలో ఆలోచనను రేకెత్తించండి.” అని సీఎం సూచించారు.

ఉద్యమస్పూర్తిగా పీ4

“ఇప్పటి వరకూ 9,37,913 బంగారు కుటుంబాల ఎంపిక పూర్తి అయింది. 1,03,938 మంది మార్గదర్శులను గుర్తించాం. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల బంగారు కుటుంబాలకున్న అవసరాలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించాం. 11 ప్రశ్నలతో వివరాలు నమోదు చేసి ఏఐతో విశ్లేషించాం. 31 శాతం మంది ఉద్యోగ అవకాశాలు కల్పిచాలని, 22 శాతం మంది వైద్య చికిత్సలకు సంబంధించి, 9 శాతం మంది తమ చిన్నచిన్న వ్యాపారాలను మరింత పెంచుకోడానికి అవకాశాలు కల్పించాలి. బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవటంతో పాటు గ్రామాలు, మండలాల వారీగా దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. అలాగే ఫండ్ ఏ నీడ్ అనే అంశాన్ని కూడా పీ4 కార్యక్రమంలో పెట్టాం. ఈ కార్యక్రమం అమలును ప్రతీ మూడు నెలలకు ఓ మారు సమీక్షించుకుంటాం. ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఈ కార్యక్రమంలో వాలంటరీగా పాల్గొనవచ్చు. ప్రస్తుతం నేను కూడా మార్గదర్శిగా పేరు నమోదు చేయించుకుని 250 కుటుంబాలను దత్తత తీసుకున్నాను. ఆ కుటుంబాల సంక్షేమం కోసం ప్రణాళికాబద్దంగా వెళ్తాం. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తరాఖండ్ వరదల సమయంలో ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు ప్రజల్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చాం. బాధితుల్ని తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశాం. వారిని ఇళ్లకు చేర్చేందుకు బస్సులు ఏర్పాటు చేశాం. కర్నూలును వరదలు ముంచెత్తిన సమయంలో పిలుపు ఇవ్వగానే లక్షల మందిని ఆదుకున్నారు. మార్గదర్శుల్లో స్ఫూర్తే బంగారు కుటుంబాలకు ఆసరా” అని ముఖ్యమంత్రి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here