
గ్రామస్తుల సహకారంతో రహదారుల విస్తరణ : యార్లగడ్డ
*ఐటీ కి చిరునామా గా విశాఖ
*లోకేష్ కృషి తో రాష్ట్రానికి పెట్టుబడులు
గన్నవరం :
వివిధ గ్రామాల్లో కుచించుకుపోయిన ప్రధాన రహదారులను గ్రామస్తుల సహకారంతో, వారి ఆమోదం మేరకు విస్తరిస్తున్నట్లు ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో పిఎసిఎస్ లో రూ. 1.10 కోట్ల ఖర్చుతో చేపట్టిన కల్యాణమండపం నిర్మాణానికి సోమవారం ఉదయం కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం తో కలిసి యార్లగడ్డ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు నున్న గ్రామంలోని ప్రధాన రహదారులు విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గ్రామస్తుల సహకారంతో ఈ గ్రామంలోని ప్రధాన రహదారులను 100 అడుగుల వెడల్పుతో విస్తరించేందుకు యోచిస్తున్నట్లు చెప్పారు. పిఎసిఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన కళ్యాణ మండపాన్ని ఏసీ కళ్యాణమండపంగా అభివృద్ధి చేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఈ గ్రామంలో 2024 ఎన్నికల్లో తొలిసారి టిడిపి కి 1500 ఓట్లు మెజార్టీ వచ్చిందని ఇంతటి మెజార్టీ ఇచ్చిన గ్రామస్తులకు ఈ సందర్భంగా యార్లగడ్డ ధన్యవాదాలు తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలోని పిఎసిఎస్ లను ప్రత్యేక దృష్టితో చూసి ఎక్కువ నిధులు మంజూరు చేయాలని నెట్టెం రఘురాం కు విజ్ఞప్తి చేశారు. గన్నవరంలో ట్రామా కేంద్రం ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అధార్టీకి ఇప్పటికే ప్రతిపాదన పంపించినట్లు ఎమ్మెల్యే వెంకట్రావు తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో రెవిన్యూ రికార్డులు భారీ స్థాయిలో టాంపరింగ్ గురైనందున పరిపాలన సౌలభ్యం కోసం నియోజకవర్గంలోని 4 మండలాలను ఎన్టీఆర్ జిల్లాలో విలీనం చేయాలని మంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు యార్లగడ్డ వివరించారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి చేయంగా ముందుకు సాగుతున్నట్టు ఎమ్మెల్యే వెంకట్రావు తేల్చి చెప్పారు.
*ఐటీ కి చిరునామాగా విశాఖ :
రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం ఐటీ కి చిరునామాగా మారనుందని ఎమ్మెల్యే వెంకట్రావు నమ్మకాన్ని వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో గూగుల్ డాటా కేంద్రం ఏర్పాటు అయిన తర్వాత మరెన్నో డేటా సెంటర్లు ఏర్పాటు అవుతాయని తద్వారా లక్షలాదిమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని యార్లగడ్డ ధీమా వ్యక్తం చేశారు. పెట్టుబడులు రావాలంటే సుస్థిర ప్రభుత్వం ఉండటంతోపాటు, ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు నమ్మకం ఉండాలని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వంలో కోడిగుడ్లు పిల్లలు అంటూ ఐటీ మంత్రి కాలక్షేపం చేయగా, ప్రస్తుత ఐటి మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించెందుకు, ఇతోదికంగా కృషి చేస్తున్నారని, లోకేష్ కృషి వల్ల రాష్ట్రంలో పెద్దసంఖ్యలో ఐటీ సంస్థలు ఏర్పాటు అవుతున్నాయని యార్లగడ్డ వివరించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమైనప్పటికీ హుందాతనం ఉండాలన్నారు. ఈ సందర్భంగా రూ.39.46 లక్షలు డివిడెంట్ల రూపంలో సభ్యులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, పిఎసిఎస్ చైర్మన్ కలకోటి శ్రీనివాసరెడ్డి టిడిపి నాయకులు గోడళ్ల చిన్న రామారావు, పామర్తి శ్రీనివాస్, గంప శ్రీనివాస్, మాధు శివరాం ప్రసాద్, గుజ్జర్లపూడి బాబురావు, కోటిరెడ్డి, సుదీప్ రెడ్డి, మేడేపల్లి రమ, శ్రీనాథ్, అంబాపురం సర్పంచ్ గండికోట సీతయ్య తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()
