గృహ నిర్మాణాల్లో ప్రజల సంతృప్తే గీటురాయి

Spread the love

విజయవాడ 20/11/2025

గృహ నిర్మాణాల్లో ప్రజల సంతృప్తే గీటురాయి

  • ప్రతి ఒక్కరూ నెలవారీ లక్ష్యాలు సాధించాలి.
  • అలసత్వం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం
  • ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

గృహ నిర్మాణాలను వేగవంతం చేసి సకాలంలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని ఏవీఎస్ రెడ్డి కాన్ఫరెన్స్ హాల్ లో గృహాల నిర్మాణంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు నిర్మించుకోవడం ఒక కల అని , దానిని సాకారం చేసేలా అధికారులు కృషి చేయాలని చెప్పారు. వివిధ స్థాయిలలో ఉన్న గృహాల నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. లబ్ధిదారు బిల్లులను ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేయాలని, ఈ విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని చెప్పారు. గృహ నిర్మాణంలో ప్రజల సంతృప్తే గీటు రాయని చెప్పారు. అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటించి, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడాలని, గృహ నిర్మాణం పూర్తి చేసే దిశగా ప్రోత్సహించాలని చెప్పారు. ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తోందని, గృహ నిర్మాణానికి ఆర్థిక మద్దతు ఇస్తోందని, ఇవి లబ్ధిదారులకు చేరేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. నెలవారీ లక్ష్యాలను ప్రతి ఒక్కరూ సాధించాలని చెప్పారు. విధులలో అలసత్వం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పీఎం ఆవాస్ యోజన (గ్రామీణ్) 2.0 సర్వే నిర్వహిస్తున్నామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల మంజూరు జరుగుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పిడి రజనీకుమారి, ఈ ఈ, డి ఈ, ఏఈలు పాల్గొన్నారు.

Loading