తిరువూరు, ఆగస్టు 02, 2025
గిరిజన న్యాయ జాగృతి కీలక మైలురాయి
- నల్సా సంవాద్‌తో ఆదివాసీల జీవితాల్లో వెలుగులు
- లీగల్ ఎయిడ్ క్లినిక్‌లతో గిరిజనులకు సాధికారత
- న్యాయ సేవలతో పాటు వారి అభివృద్ధికీ గొప్ప మార్గం
- ఉచిత న్యాయ సహాయ సేవలను, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
- హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారీ
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (ఎస్ఎల్ఎస్ఏ) చరిత్రలో గిరిజన న్యాయ జాగృతి కీలక మైలురాయి అని.. నల్సా సంవాద్ పథకంతో ఆదివాసీల జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నాయని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ రవినాథ్ తిల్హారీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, కృష్ణా జిల్లా న్యాయసేవాధికార సంస్థ, ఎన్‌టీఆర్ జిల్లా పరిపాలనా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఎ.కొండూరు ఎస్ఎన్ కన్వెన్షన్ హాల్‌లో గిరిజన న్యాయ జాగృతి పేరుతో కొత్త మాడ్యూల్ న్యాయ సేవల శిబిరం జరిగింది. గిరిజనుల ఆరోగ్యం, హక్కుల రక్షణ, సమస్యలకు పరిష్కారం లక్ష్యంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ రవినాథ్ తిల్హారీ మాట్లాడుతూ నల్సా సంవాద్ (SAMVAD – స్ట్రెంథనింగ్ యాక్సెస్ టు జస్టిస్ ఫర్ మార్జినలైజ్డ్ వల్నరబుల్ ఆదివాసీస్ అండ్ డీనోటిఫైడ్/నోమాడిక్ ట్రైబ్స్) పథకం-2025 ప్రయోజనాలు, లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు, గిరిజనుల సాధికారతకు దోహదం చేస్తాయన్నారు. ఎలాంటి వివక్షకు తావులేకుండా గిరిజనుల హక్కుల పరిరక్షణలో పారా లీగల్ వాలంటీర్లు, ప్యానెల్ న్యాయవాదులు కీలకపాత్ర పోషించనున్నారని.. ఈ సరికొత్త పథకం ద్వారా కేవలం న్యాయ సహాయ సేవలే కాకుండా గిరిజనుల అభివృద్ధికి గొప్ప మార్గం వేయడం జరుగుతుందని, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా పూర్తిస్థాయి లబ్ధిజరిగేలా కృషిచేయడం జరుగుతుందన్నారు. గిరిజనుల సమాగ్రాభివృద్ధికి ఉన్న అడ్డంకులను గుర్తించి, తొలగించడం ముఖ్యమని.. కిడ్నీ వ్యాధుల ప్రభావిత ప్రాంతమైన ఎ.కొండూరులో ప్రజలు ఆరోగ్య హక్కుతో పాటు ఇతర అన్ని హక్కులు పొందేలా చేయడంలో ప్రభుత్వ విభాగాలు, న్యాయ వ్యవస్థ సమష్టి కృషి కీలకమన్నారు. వైద్య శిబిరాల ద్వారా నిరంతర నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా సేవలు అందిస్తాయన్నారు. ఈ కార్యకలాపాలను రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ నిరంతరం పర్యవేక్షిస్తుందని, రాజ్యాంగం కల్పించిన హక్కులు గిరిజనులు పొందేలా చేయీచేయీ కలుపుదామని జస్టిస్ రవినాథ్ తిల్హారీ పేర్కొన్నారు.
కొత్త ఆలోచనలతో కొత్త జీవితం: కృష్ణా డీఎల్ఎస్ఏ ఛైర్‌పర్సన్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ జి.గోపి
కృష్ణా డీఎల్ఎస్ఏ ఛైర్‌పర్సన్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ జి.గోపి మాట్లాడుతూ ప్రభుత్వం, ప్రజలను అనుసంధానిస్తూ రాష్ట్ర, జిల్లా న్యాయసేవాధికార సంస్థలు సేవలు అందిస్తున్నాయని, ఈ సేవలపై ప్రజలు అవగాహన పెంపొందించుకొని, సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. న్యాయం దృష్టిలో అందరూ సమానులేనని.. ఏ ఒక్కరూ ఆర్థిక, ఇతర సమస్యల కారణంగా న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండేందుకు ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతోందని పేర్కొన్నారు. సంవాద్ స్కీమ్‌ను సద్వినియోగం చేసుకొని, స్వీయ క్రమశిక్షణతో, కొత్త ఆలోచనలతో గిరిజనులు అభివృద్ధి పథంలో పయనించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎ.కొండూరు ప్రాంతంలో ఉచిత న్యాయ సేవలు, పారా లీగల్ వాలంటీర్ల సేవలు, నవోదయం అమలు, ఉచిత వైద్య శిబిరాలు తదితరాలను జి.గోపి క్షుణ్నంగా వివరించారు.
స్వర్ణాంధ్ర దిశగా ఇదో గొప్ప ముందడుగు: కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధన దిశగా చేస్తున్న ప్రయాణంలో గిరిజనులను జాగృతం చేసి వారి సమగ్రాభివృద్ధికి ఉపయోగపడే గొప్ప కార్యక్రమం ఇదని.. న్యాయ సేవాధికార సంస్థల సేవలను సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. పీఎం జన్‌మన్, ధాత్రి ఆభా – జన భాగిధరి అభియాన్, పీఎం సూర్యఘర్ వంటివాటిని ఉపయోగించుకోవాలన్నారు. అటవీ హక్కుల చట్టం, 2006 కింద ఎస్‌టీ రైతులకు 434 ఆర్‌వోఎఫ్ఆర్ పట్టాలకుగాను 684 ఎకరాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వినూత్న పీ4 విధానం, కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం పటిష్ట అమలు, జల్ జీవన్ మిషన్ పనులు, బాధితులకు పరిహారం, నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలు, తలసరి ఆదాయంలో పెరుగుదలకు తీసుకుంటున్న చర్యలు, 15 శాతం సుస్థిర వార్షిక ఆర్థిక వృద్ధి సాధనకు చర్యలు వంటివాటిని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
గిరిజనులకు అండగా పోలీసు వ్యవస్థ: సీపీ రాజశేఖరబాబు
గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వాలు వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తున్నాయని.. వాటిపై అవగాహన పెంపొందించుకొని సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు అన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనకు తావులేకుండా, రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల పరిరక్షణకు సమష్టిగా కృషిచేయాల్సిన అవసరముందన్నారు. బడుగుబలహీన వర్గాలపై అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి గ్రామంలో, తండాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని పటిష్టంగా అమలుచేస్తున్నామని.. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషిచేస్తున్నట్లు తెలిపారు. నాటుసారా రహిత జిల్లా లక్ష్యంగా నవోదయం 2.0 కార్యక్రమాన్ని అమలుచేస్తూ పరివర్తనకు కృషిచేస్తున్నట్లు సీపీ వివరించారు.
కార్యక్రమంలో భాగంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ), వైద్య ఆరోగ్య శాఖ, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, వ్యవసాయం, ఉద్యాన, విభిన్న ప్రతిభావంతులు, మైనారిటీ తదితర శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను జస్టిస్ రవినాథ్ తిల్హారీ.. అధికారులతో కలిసి పరిశీలించారు. లబ్ధిదారులకు మెడికల్ కిట్లు అందజేశారు. ఎ.కొండూరు మండలంలోని 32 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ (2025-26 జులై)కి సంబంధించి రూ. 4.70 కోట్ల చెక్‌ను అందించారు. అదేవిధంగా 32 మంది ఎంటర్‌ప్రెన్యూర్లకు స్త్రీనిధి మహిళా బ్యాంకు ద్వారా రూ. 30 లక్షల చెక్‌ను, నవోదయం 2.0 కార్యక్రమంతో 15 కుటుంబాలకు జీవనోపాధి కోసం రూ. 10 లక్షల సీఎస్ఆర్ నిధుల చెక్‌ను అందజేయడం జరిగింది.
కార్యక్రమంలో ఏపీ ఎస్ఎల్ఎస్ఏ మెంబర్ సెక్రటరీ బీఎస్‌వీ హిమబిందు, డిప్యూటీ సెక్రటరీ డా. హెచ్.అమర రంగేశ్వరరావు, డీఎల్ఎస్ఏ కార్యదర్శి, సివిల్ జడ్జ్ (సీనియర్ డివిజన్) కేవీ రామకృష్ణయ్య, తిరువూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సీహెచ్ వెంకటరెడ్డి, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, వివిధ శాఖల అధికారులు, ప్రజలు హాజరయ్యారు.