ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు

Spread the love

ఎన్టీఆర్ జిల్లా, అక్టోబర్ 14, 2025

ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు

  • పటిష్ట సమన్వయంతో కొనుగోలుకు సిద్ధంకండి
  • రైతు క్షేమం, సంక్షేమం లక్ష్యంగా కార్యాచరణ ఉండాలి
  • జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

జిల్లాలో రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఖరీఫ్ ధాన్యం సేకరణకు పగడ్బందీ ప్రణాళికలు రూపొందించి, అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
ఖరీఫ్ 2025 – 26 ధాన్యం సేకరణకు సంబంధించి పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్‌లో మంగళవారం జిల్లాస్థాయి అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో కలెక్టర్ లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తదితరులతో కలిసి పాల్గొన్నారు.
పౌరసరఫరాలు, వ్యవసాయం, సహకార ఇతర శాఖల అధికారులు, కస్టోడియన్ అధికారులు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లా మొత్తంలో 3,59,733 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తిని అంచనా వేయగా ప్రాథమికంగా సుమారు 3,03,154 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 159 రైతు సేవా కేంద్రాలు ద్వారా కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిందిగా, కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు వాట్సాప్ ద్వారా ధాన్యం కొనుగోలు షెడ్యూల్‌ను తెలియజేయడం ద్వారా అవగాహన కల్పించాల్సిందిగా సూచించారు. అలాగే గన్నీలు, కార్మికులు, వాహనాలు అవసరానికి అనుగుణంగా అందుబాటులో ఉంచాలని, టార్పాలినులు కూడా అవసరమైన చోట్ల అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రైతులకు కనీస మద్దతు ధర లభించే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడా ఏ రైతూ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇబ్బంది పడకుండా చూడాలని.. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించాలని ఆదేశించారు. తేమ శాతాన్ని కొలిచే యంత్రాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలని సూచించారు.
సమావేశంలో పౌరసరఫరాల డీఎం టి.వెంకట సతీష్, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, తిరువూరు ఆర్డీవో కె.మాధురి, నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *