క్రీడాకారుల విష‌యంలో రాజీప‌డే ప్ర‌స‌క్తే లేదు శాప్ డైరెక్ట‌ర్ల ప్ర‌మాణ స్వీకారంలో మంత్రి రాంప్ర‌సాద్ రెడ్డి, ఎంపీ కేశినేని చిన్ని, శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు

2
0

27-06-2025

క్రీడ‌ల అభివృద్ధికి కూట‌మి కృషి

  • అమ‌రావ‌తిలో 2500 ఎక‌రాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సీఎం చంద్ర‌బాబు కృషి
  • స్పోర్ట్స్ అథారిటీకి ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ స‌హ‌కరిస్తుంది
  • గ‌త ఐదేళ్ల‌లో క్రీడాకారుల‌కు తీవ్ర అన్యాయం
  • మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో 421 ఉద్యోగాలు క‌ల్పిస్తున్న ప్ర‌భుత్వం
  • క్రీడాకారుల విష‌యంలో రాజీప‌డే ప్ర‌స‌క్తే లేదు
  • శాప్ డైరెక్ట‌ర్ల ప్ర‌మాణ స్వీకారంలో మంత్రి రాంప్ర‌సాద్ రెడ్డి, ఎంపీ కేశినేని చిన్ని, శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు

విజ‌య‌వాడ‌: ఏపీలో క్రీడ‌ల అభివృద్ధే ధ్యేయంగా కూట‌మి ప్ర‌భుత్వం విశేష‌మైన కృషి చేస్తుంద‌ని, దానిలో భాగంగా అమ‌రావ‌తి వేదిక‌గా 2500 ఎక‌రాల్లో అత్య‌ద్భుత‌మైన స్పోర్ట్స్ సిటీని నిర్మించేందుకు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర క్రీడాశాఖామంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్‌(చిన్ని) పేర్కొన్నారు.

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో శుక్ర‌వారం నిర్వ‌హించారు. శాప్ ఛైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర క్రీడాశాఖామంత్రి ఎమ్.రాంప్ర‌సాద్‌ రెడ్డి, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్(చిన్ని) ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. తొలుత కార్య‌క్ర‌మానికి విచ్చేసిన ముఖ్య అతిథులు, శాప్ ఛైర్మన్‌తోపాటు శాప్ డైరెక్టర్లు జ్యోతిప్రజ్వలన చేశారు.

ఈ సంద‌ర్భంగా శాప్ డైరెక్టర్లుగా నియమితులైన కొవ్వాసు జగదీశ్వరి, ఇ.రజినీ, పేరం రవీంద్రనాథ్, పీబీవీఎస్ఎన్.రాజు, ఎస్.సంతోష్ కుమార్, బొమ్మినేని శివ, ఎ.రమణారావు, ఎండీ రమేష్ కుమార్‌ల‌తో క్రీడాశాఖామంత్రి ప్రమాణం చేయించగా సంత‌కాలు చేసి బాధ్యతలు స్వీక‌రించారు. అనంత‌రం శాప్ డైరెక్ట‌ర్ల‌ను ఘ‌నంగా స‌త్క‌రించారు.

ఏపీ స్పోర్ట్స్ పాల‌సీ భేష్‌

ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాభివృద్ధి, యువతలో ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయ‌డ‌మే ప్రభుత్వ ప్రధాన లక్ష్య‌మ‌న్నారు. గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌లో భాగంగా 2014-2019 మధ్య రూపొందించిన ప్రణాళికల ద్వారా ఆంధ్రప్రదేశ్ క్రీడారంగానికి పునాదులు పడ్డాయన్నారు. క్రీడ‌ల్లో రాజ‌కీయాలు వ‌ద్ద‌ని, క్రీడా సంఘాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని సూచించారు. గ‌త వైసీపీ నాయ‌కులు క్రీడాస్ఫూర్తిని దెబ్బ తీసేలా రాజ‌కీయాల‌ను పెంచి పోషించార‌న్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా రాష్ట్రంలో స్పోర్ట్స్‌ పాల‌సీని రూపొందించిన ఘ‌న‌త సీఎం చంద్ర‌బాబునాయుడుకే ద‌క్కుతుంద‌న్నారు. రానున్న రోజుల్లో క్రీడాకారుల‌కు మంచి భవిష్య‌త్తు ఉంటుంద‌న్నారు. నూత‌నంగా నియ‌మితులైన డైరెక్ట‌ర్లు క్రీడ‌ల‌ను అభివృద్ది చేసేందుకు పూర్తిస్థాయిలో స‌హ‌క‌రించాల‌న్నారు. రాష్ట్రంలోని ప్ర‌తీ పాఠ‌శాల‌లోనూ క్రీడ‌లు ఆడేందుకు వ‌స‌తులు క‌ల్పించేలా నారా లోకేష్ ప్ర‌ణాళిక రూపొందించార‌న్నారు. త్వ‌ర‌లో శాప్‌ ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడలో ఫెస్ట్ నిర్వ‌హించ‌నున్నామ‌న్నారు. అమరావతి వేదికగా త్వరలో 2500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ రానుందని, ప్ర‌స్తుతం స్థ‌ల ప‌రిశీల‌న జ‌రుగుతుందన్నారు. ఇందుకోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు లండ‌న్ లోని ఒలింపిక్ పార్క్ తోపాటు పెద్ద పెద్ద స్పోర్ట్స్ సిటీల‌ను పరిశీలించేందుకు స్వ‌యంగా వెళ్ల‌తార‌ని తెలిపారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి శాప్‌తో కలిసి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పనిచేస్తుంద‌న్నారు. 26 జిల్లాల‌కు క్రికెట్ గ్రౌండ్స్ త‌యారు చేయ‌ట‌మే ల‌క్ష్యంగా ఏసీఏ ప‌నిచేస్తుంద‌న్నారు. అద‌నంగా ఏసీఏ కి వున్న నెల్లూరు, క‌ర్నూల్ గ్రౌండ్స్ లో ఇత‌ర క్రీడ‌ల‌కు కావాల్సిన విధంగా గ్రౌండ్స్ త‌యారు చేస్తామ‌న్నారు. రాబోయే ఏడాదిన్న‌ర కాలంలో ప్ర‌తి జిల్లాలో స్టేడియాలు వుండే విధంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలిపారు.

రాజ‌కీయాల‌కు అతీతంగా క్రీడాభివృద్ధి

రాజ‌కీయాల‌కు తావులేకుండా కూట‌మి ప్ర‌భుత్వం క్రీడ‌ల‌ను ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ముందుకు తీసుకెళ్తుంద‌ని క్రీడాశాఖామంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి పేర్కొన్నారు. 20ఏళ్లుగా క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నవారిని శాప్ డైరెక్టర్లుగా నియమించడం శుభపరిణామమ‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన మెగా డీఎస్సీలో భాగంగా రాజకీయ ప్రమేయం లేకుండా స్పోర్ట్స్ కోటా కింద 421 ఉద్యోగాలు కల్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి ద‌క్కుతుంద‌న్నారు. గ‌త ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో క్రీడాకారుల‌కు తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని, సీఎం చంద్రబాబు నాయుడు సార‌ధ్యంలో ఏపీలో క్రీడ‌ల అభివృద్ధి వేగ‌వంత‌మైంద‌న్నారు. స్పోర్ట్స్ అథారిటీ, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కలిసి గ్రామీణ క్రీడాకారుల‌ను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. శాప్ బోర్డుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి సంపూర్ణ స‌హ‌కారం అందిస్తామ‌ని, క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంద‌న్నారు.

క్రీడాకారుల భ‌విష్య‌త్తే ముఖ్యం

క్రీడాకారుల భ‌విష్య‌త్తే కూట‌మి ప్ర‌భుత్వానికి ముఖ్య‌మ‌ని, ఆ దిశ‌గా క్రీడాకారుల‌కు మేలు చేకూర్చేందుకు కృషి చేస్తుంద‌ని శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు అన్నారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, విద్యాశాఖామంత్రి నారా లోకేష్‌ల స‌మిష్టి కృషితో ఏపీలో క్రీడారంగం అభివృద్ధి చెందుతుంద‌న్నారు. క్రీడ‌లు, క్రీడాకారుల విష‌యంలో రాజీప‌డే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. మంత్రి నారా లోకేష్ సూచ‌న‌ల మేర‌కు క్రీడ‌ల‌ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు శాప్ పాల‌క‌మండ‌లి సాయ‌శ‌క్తులా కృషి చేస్తుంద‌న్నారు. క్రీడ‌ల‌ను ప్రోత్స‌హించే వ్య‌క్తుల‌ను శాప్ డైరెక్ట‌ర్లుగా నియ‌మించ‌డం శుభ‌ప‌రిణామ‌మ‌న్నారు.

ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్, ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పీలా గోవింద్, విజయనగరం రీజనల్ ఆర్టీసీ ఛైర్మన్ దన్నుదొర, ఏపీ బిల్డింగ్‌ అదర్‌ కనస్ట్రక్షన్‌ వర్కర్స్‌ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, స్టేట్ ట్రైబల్ ఎడ్వయిజరీ కమిటీ సభ్యులు ధారూ నాయక్‌, టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్య‌క్షులు ప‌రుచూరి ప్ర‌సాద్ ల‌తో పాటు త‌దితరులు పాల్గొని శాప్ డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here