
ఎన్‌టీఆర్ జిల్లా, అక్టోబర్ 28, 2025
కొండ ప్రాంతాల ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి
- ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాం
- రియల్ టైమ్ డేటా ఆధారంగా క్షేత్రస్థాయి బృందాల చర్యలు
- అవసరమైన ఔషధాలను అందుబాటులో ఉంచాం
- రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్
మొంథా తుపాను నేపథ్యంలో విజయవాడ అర్బన్ పరిధిలో కొండ ప్రాంతాల ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టడం జరిగిందని.. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
మంగళవారం మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్, వ్యవసాయం, ఇరిగేషన్, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, ఆర్‌టీజీఎస్ సూచనలు మేరకు జిల్లాలో విపత్తును ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రత్యేకంగా ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా విజయవాడ అర్బన్ ప్రాంతంలో కొండ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడేందుకు అవకాశమున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి.. ముప్పు ఉన్న ఆవాసాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. నిండు గర్భిణీలతోపాటు తక్షణ వైద్య సాయం అవసరమైన వారిని గుర్తించి సమీప ఆసుపత్రులకు తరలించి.. సేవలందిస్తున్నట్లు తెలిపారు. దుర్బలమైన 25 రహదారులను, ఆరు చెరువులను గుర్తించి ప్రత్యేక ప్రణాళికతో అప్రమత్తంగా ఉన్నట్లు వివరించారు. అవసరమైన మందులతో పాటు 108, 104 ద్వారా సమర్థవంతంగా సేవలందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అన్ని పీహెచ్‌సీల పరిధిలో వాహనాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. వర్షాలు పడుతున్నప్పుడే కాకుండా తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని.. అంటు రోగాలు వ్యాప్తి చెందకుండా వైద్య ఆరోగ్య శాఖ.. సమన్వయ శాఖలతో కలిసి పనిచేస్తోందని మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
పునరావాస కేంద్రాన్ని సందర్శించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
మంత్రి సత్యకుమార్ యాదవ్.. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి విజయవాడ అర్బన్ పరిధిలోని చిట్టినగర్ రాకేష్ ఈఎం హైస్కూల్‌లోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్నవారితో మాట్లాడి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.
![]()
