
ఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 11, 2025
కుష్టు వ్యాధి నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టండి…
- వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు 1296 ప్రత్యేక బృందాల ఏర్పాటు
- వ్యాధిని సమూలంగా నిర్మూలించాలన్నదే లక్ష్యం…
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
కుష్టు వ్యాధి నివారణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని వ్యాధిగ్రస్తులను గుర్తించి అవసరమైన వైద్య సహాయం అందించడం ద్వారా వ్యాధిని సమూలంగా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈనెల 17వ తేదీ నుండి 30వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న కుష్టు వ్యాధి పరీక్షల నిర్వహణ, వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమంపై మంగళవారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కుష్టు వ్యాధి నివారణకు ప్రభుత్వ పరంగా అవసరమైన చర్యలను తీసుకోవడం జరుగుతుందన్నారు. కుష్టు వ్యాధిని సమూలంగా రూపుమాపాలన్న లక్ష్యంతో కుష్ఠు వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ముందుగానే గుర్తించి సకాలంలో వైద్య సహాయం అందించగలిగితే వ్యాధిని త్వరితగతిన నివారించవచ్చునన్నారు. కుష్ఠు వ్యాధి లక్షణాలు ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఈనెల 17వ తేది నుండి 30వ తేదీ వరకు మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు కోసం 1296 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేక సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రత్యేక బృందాలు ప్రతి ఇంటిని సందర్శించి వ్యాధి లక్షణాలను ఉన్నవారిని గుర్తించడం జరుగుతుందన్నారు. చర్మంపై స్పర్శ లేని మచ్చలు, చెవులు, కనుబొమ్మలు రెప్పల వెంట్రుకలు రాలిపోవడం, కనురెప్పులు మూతపడకపోవడం, ముక్కు దిబ్బడ, ముక్కు నుండి రక్తం కారడం, కాళ్ళు, చేతులు తిమ్మిర్లు, అరికాళ్ళు, అరిచేతులలో స్పర్శ కోల్పోవడం, చల్లని లేదా వేడి వస్తువులను గుర్తించలేకపోవడం, చేతుల నుండి వస్తువులు జారిపోవడం, చేతివేళ్ళు, కాళ్ళ వేళ్ళు వంకర్లు తిరగడం వంటి లక్షణాలు కలిగిన వారిని గుర్తించి సమీపంలోని వైద్య ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుందన్నారు. కుష్టు వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించేందుకు ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లకు కుష్టు వ్యాధి పై అవగాహన కల్పించేలా శిక్షణ ఇవ్వాలన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య కేంద్రాలలోని ఆరోగ్య కార్యకర్త వద్ద మందులను అందుబాటులో ఉంచి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని వ్యాధి లక్షణలు ఉ న్నవారు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా కుష్టు నివారణ అధికారిణి డా.బి. బానునాయక్ మాట్లాడుతూ జిల్లాలో కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆశా వర్కర్లు, పారామెడికల్ సిబ్బంది. ప్రతి ఇంటిని సందర్శించి వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించి వారి వివరాలను ఏ.ఎన్. ఎంలకు తెలియజేస్తారని లక్షణాలు ఉన్న వారి డేటాను ప్రత్యేక యాప్ లో నమోదు చేసి వైద్య అధికారులకు అందజేస్తారన్నారు. వైద్యాధికారులు లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి కుష్టు వ్యాధి నిర్ధారణ అయితే వ్యాధి తీవ్రతను బట్టి 6 నెల నుండి 12 నెలల వరకు ప్రతి నెల మందులను వైద్య సేవలను అందించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 54 లెప్రసీ కేసులను గుర్తించడం జరిగిందని వారికి ప్రాధమిక ఆరోగ్య కేంద్రా ద్వారా వైద్య సేవలు అందించడంతో పాటు పింఛన్లు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.
సమావేశంలో డిఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం.రమాదేవి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ జె ఇందుమతి, డా. పి.నవీన్, డా. స్నేహ సమీరా, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
![]()
