
కలెక్టరేట్ సుందరీకరణలో భాగస్వామ్యం కావాలి..
ఉద్యోగులతో కలిసి పలు ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను శుభ్రం చేసిన జిల్లా కలెక్టర్
కలెక్టరేట్లో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణ..
సైకిల్ పై విధులకు హాజరైన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం: నవంబరు 22, 2025
ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను శుభ్రం చేసి కలెక్టరేట్ సుందరీకరణలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
శనివారం ఉదయం ఆయన కలెక్టరేట్ లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించి పరిసరాల పరిశుభ్రత చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని ఎంపిక చేసిన పలు ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలోని పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం తొలగించి శుభ్రం చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి శనివారం ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని ఎంపిక చేసుకుని మిగతా శాఖల ఉద్యోగులు సమిష్టిగా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసే విధంగా జిల్లా కలెక్టర్ రూపకల్పన చేసిన నేపథ్యంలో, పలు శాఖల ఉద్యోగులను బ్లాక్ లుగా విభజించి తపాలా, జిల్లా పంచాయతీ, ఆర్డీవో, సీపీఓ, ఆర్టీజీఎస్, ఖజానా శాఖల పరిసరాలను శుభ్రం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, జిల్లాలో ప్రతి నెలలో మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుండగా, నెలలో ప్రతి శనివారమూ కార్యాలయాల్లో శుభ్రత చేపట్టే విధంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని స్వచ్ఛఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దశలవారీగా శుభ్రం చేస్తూ కలెక్టరేట్ ను సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
సామాజిక బాధ్యతగా వ్యవహరించి ప్రతి శనివారం కార్యాలయ విధులకు సైకిల్ లేదా నడక ద్వారా రావాలని ఉద్యోగులకు పిలుపునిచ్చిన కలెక్టర్ శనివారం ఉదయం యధావిధిగా సైకిల్ పై వచ్చి కార్యాలయ విధులకు హాజరయ్యారు.
కార్యక్రమంలో డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, జిల్లా పంచాయతీ అధికారిణి డాక్టర్ జే అరుణ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల అధికారులు జీ రమేష్, విద్య శాఖ అధికారులు పివిజే రామారావు తదితర శాఖల అధికారులు, సిబ్బంది, నగర మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.
![]()
