07-08-2025
తాడేపల్లి:
- ఓటమి భయంతోనే పులివెందులలో టీడీపీ అరాచకం
: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం.
తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు.
- రోజురోజుకీ పతనమవుతున్న చంద్రబాబు గ్రాఫ్..
- అందుకే పులివెందులలో ఖాకీ యూనిఫాం సాయంతో అరాచకం..
- చంద్రబాబు డైరెక్షన్ లో వైయస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు..
- గీత దాటిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు..
: అంబటి రాంబాబు హెచ్చరిక
తాడేపల్లి:
వైయస్ఆర్ కడప జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ అరాచకంకు పాల్పడుతోందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ 14 నెలల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పతనం కనిపిస్తోందని అన్నారు. ప్రజల విశ్వాసానికి దూరం అవ్వడం వల్లే పోలీసుల సాయంతో ఉప ఎన్నికల్లో గెలిచి పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గూండాలను ఉసిగొల్పడం, పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి వైయస్ఆర్‌సీపీని నిలువరించాలని కలలు కంటున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ లోకేష్ చెప్పినట్లు చేస్తూ వైయస్సార్సీపీ నేతలపై కేసులు బనాయిస్తున్న ఐపీఎస్ అధికారులతో సహా ఎవరూ చట్టానికి అతీతులు కారన్న విషయం మర్చిపోవద్దని హెచ్చరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
విశాఖలో గెలుపే ప్రజాభీష్టానికి ప్రతీక:
విశాఖపట్నం గ్రేటర్ మున్సిపాల్టీ స్టాంటింగ్ కమిటీ ఎన్నికల్లో గరిష్టంగా 50 ఓట్లతో వైయస్సార్సీపీ ఒక స్ధానాన్ని గెల్చుకుంది. గతంలో వైయస్సార్సీపీకి వైజాగ్ కార్పొరేషన్ లో 59 మంది సభ్యులుంటే కూటమి ప్రభుత్వం వారిలో 27 మందిని కొనుగోలు చేయగా.. వైయస్సార్సీపీ బలం 32 కు చేరింది. అయినా కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మా అభ్యర్ధి గెలిచారు. చంద్రబాబును నమ్మి వెళితే ఆయన దగ్గర ఏం లేదని తెలుసుకుని తిరిగి వైయస్సార్సీపీని గెలిపించాలన్న ఉద్దేశ్యంతో ప్రజలు ఉన్నారని చెప్పడానికి ఈ గెలుపు ఓ సంకేతం. పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక జరుగుతుంది. ఏ ఎన్నిక జరిగినా ఏదో ఒక అక్రమాలు చేసి… ఎలాగైనా గెలచి తన గ్రాఫ్ పడిపోవడం లేదు, తన పతనం ప్రారంభమవ్వలేదు అని నిరూపించుకోవాలన్న తాపత్రయంలో చంద్రబాబు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పులివెందులలో ఇప్పుడు ఎన్నిక జరుగుతున్న జడ్పీటీసీ స్ధానం వైయస్సార్సీపీదే. దురదృష్ఠవశాత్తూ ప్రమాదంలో ఆ జెడ్పీటీసీ మరణిస్తే ఇప్పుడు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఇంకా 12 నెలలే మిగిలి ఉన్నా… ఈ ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెట్టో, అధికార దుర్వనియోగానికి పాల్పడో లేదంటే చివరికి బెదిరించైనా గెలవాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు పోలీస్ యంత్రాంగం సహకారంతో పూర్తిగా దిగజారి ప్రవర్తిస్తున్నారు.
టీడీపీని గెలిపించే బాధ్యత పోలీసులు తీసుకున్నారా..?
వైయస్ జగన్ నియోజకవర్గంలో మేం జెడ్పీటీసీని కైవసం చేసుకున్నామని చెప్పుకోవడానికి చంద్రబాబు అత్యంత నీచానికి దిగజారుతున్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మా పార్టీ నాయకులు వేల్పులు రాముపై దాడి చేసి హత్యచేయడానికి ప్రయత్నించారు. కారు మీద పెట్రోల్ పోసి తగులబెట్టి భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు పూర్తిగా చేతులెత్తేసి.. వైయస్సార్సీపీ నేతల మీద జరిగిన దాడిని సినిమా చూసినట్లు చూస్తున్నారు. పూర్తిగా తెలుగుదేశం పార్టీ రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. దాడి జరిగిన తర్వాత గాయపడిన వాళ్ల మీద కేసులు పెట్టారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడి చావుబ్రతుల్లో ఉన్న వేల్పుల రాము మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నారు. మా నాయకులు పక్క గ్రామానికి వెళ్లి ప్రచారం చేస్తుంటే అక్కడ మా నేతల మీద దాడి చేశారు. దీనిపై కోయ ప్రవీణ్ మాట్లాడుతూ
పక్క గ్రామంలో పత్తేపారం ఏంటని అడుగుతున్నారు. లా అండ్ ఆర్డర్ పరిరక్షించాల్సిన డీఐజీ ఈ రకంగా ఎలా మాట్లాడుతారు. మేం ఉండబట్టే తలలు పగిలాయి, లేదంటే తలలు తెగిపడేవి అని బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. అంటే తలలు పగిలే వరకు వారిని అనుమతించి.. తలకాయలు తెగిపడకుండా జాగ్రత్త వహించారా డీఐజీ గారు ? ఒక ఐపీఎస్ అధికారి ఈ రకంగా మాట్లాడుతారా ? ఈ పరిణామాలన్నీ చూస్తుంటే పులివెందులలో వైస్సార్సీపీని ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి పోలీసులు బాధ్యత తీసుకున్నట్టు కనిపించడం లేదా ?
ఖాకీ బట్టల్లో ఉన్న పచ్చ పార్టీ కార్యకర్తలు:
మీరు ఖాకీ బట్టలు వేసుకున్నది చంద్రబాబు కాళ్ల పూజ చేయడానికి కాదు కోయ ప్రవీణ్ గారు, లా అండ్ ఆర్డర్ కాపాడ్డానికి మీకు ఖాకీ బట్టలు ఉన్నాయన్న విషయం గుర్తుంచుకొండి. ఎమ్మెల్సీ రమేష్, వేల్పుల రాము మీద దాడి జరిగితే సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదు చేశారు.. మరి ఎందుకు దాడికి పాల్పడ్డ వారిని అరెస్టు చేయడం లేదు? 12న పోలింగ్ అయ్యేంత వరకు విచ్చలవిడిగా తిరిగనిచ్చి.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి వైయస్సార్సీపీని ఓడించాలని కుట్ర చేస్తున్నారు. కేవలం టీడీపీ వాళ్లు మాత్రమే ఓట్లు వేసుకోవాలన్న అజెండా కోసం చంద్రబాబు ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం పనిచేస్తోంది. అది అప్రజాస్వామికమైన విధానం. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం సరైన పద్దతుల్లో వ్యవహరించి జడ్పీటీసీ ఎన్నిక సక్రమంగా జరిగేలా చూడాల్లిన బాధ్యత ఎన్నికల కమిషన్ కు, పోలీస్ యంత్రాంగానికి ఉంది. డీఐజీ కోయ ప్రవీణ్ పత్తి, మిర్చి వ్యాపారాల గురించి మాట్లాడకుండా లా అండ్ ఆర్డర్ కాపాడ్డంపై దృష్టి పెట్టాలని హెచ్చరిస్తున్నాం. మీరు అదుపుతప్పి ప్రవర్తిస్తే సమాజం సహించదన్న విషయం గుర్తుపెట్టుకొండి. వైయస్సార్సీపీ నేతల మీద జరుగుతున్న దాడులను నివారించాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ పై ఉంది.
అవినీతి సంపాదన దాచుకునేందుకే బాబు సింగపూర్ టూర్:
చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే.. సింగడు అద్దంకి వెళ్లాడన్న తరహాలో ఇప్పుడు సింగడు సింగపూర్ వెళ్లాడన్న తరహాలో ఉంది. కుమార సమేతంగా చంద్రబాబు అక్కడ పెట్టుబడులు పెట్టడానికో, వ్యవహారాలు చక్కబెట్టడానికో ఐదు రోజుల పాటు సింగపూర్ లో పర్యటించారు. ఈ పర్యటనలో ఏం సాధించారు? లక్షల కోట్లు కాజేయాలన్న దురుద్దేశ్యంతో సింగపూరు పర్యటనకు వెళ్లిన నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్ లు అక్కడ గిట్టుబాటు కాకపోవడంతో ద్వారా తిరిగి వచ్చిన తర్వాత శోకతప్త హృదయంతో ఉన్నారు. తిరిగి వైయస్సార్సీపీ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాను. సింగపూర్ ప్రభుత్వానికి అమరావతికి సంబంధం లేదు. మన రాష్ట్రంలో ఉన్న ప్రయివేటు కంపెనీల తరహాలోనే సింగపూర్ లో ఉన్న కొన్ని ప్రయివేటు కంపెనీలు గతంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తే.. మీరు సింగపూర్ ప్రభుత్వమే వచ్చిందని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేశారు. సింగపూర్ పార్లమెంట్ సభ్యుడు లియోన్ ఫెలీలా అక్కడ పార్లమెంటులో మంత్రి ఈశ్వర్ ను.. సింగపూర్ ప్రభుత్వం, ఏపీలో పెట్టుబడులు పెడుతుందా? అని ప్రశ్నించగా, సింగపూర్ పార్లమెంటు సాక్షిగా అలాంటి పెట్టుబడులు పెట్టబడులు పెట్టడం లేదని, సింగపూర్ ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొన్ని సింగపూర్ ప్రయివేటు కంపెనీలు మాత్రమే ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయని… అవి ప్రాధమిక దశలోనే ఉన్నాయని పార్లమెంటులో బదులిచ్చారు. దీంతో సింగపూర్ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదని తేలిపోయింది. అయినా చంద్రబాబు సింగపూర్ ప్రభుత్వమే ఇక్కడికి వస్తుందని అబద్దాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. జరిగినదంతా డొల్ల అని, ఇక్కడ లంచాలు తీసుకోవడానికే ఆ కంపెనీలు వస్తున్నాయని తెలిసి సింగపూర్ ప్రభుత్వం మాకేం సంబంధం లేదని స్పష్టం చేసింది. దీంతో చేతులు దులుపుకుంటూ వచ్చిన చంద్రబాబు, ఆయన కుమారుడు వైయస్సార్సీపీపై పడి ఏడుస్తున్నారు.
సింగపూర్ నుంచి పైసా పెట్టుబడి లేదు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున 58 సార్లు సింగపూర్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఏనాడైనా ఒక్క రూపాయి పెట్టుబడి తెచ్చారా? ఉంటే సమాధానం చెప్పాలి? రాజధాని ఏరియాలో 1691 ఎకరాలను సీడ్ క్యాపిటల్ కోసం కేటాయిస్తే.. అందులో 58 శాతం సింగపూర్ ప్రయివేటు కంపెనీలకు, మనకు 42 శాతం కేటాయించారు. సింగపూర్ కంపెనీలు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టరు, మనమే రూ.18వేల కోట్లు పెట్టుబడి పెడితే వాళ్లు డిజైన్ చేసే విధంగా దౌర్భాగ్యమైన అగ్రిమెంట్ చేసుకున్నారు. కాబట్టే ఇది విఫలమైంది. దానికి మా పార్టీ మీద ఏడ్చే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ప్రజలకు కూడా చంద్రబాబు ఈ విషయం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇన్ని మోసాలు చేస్తున్న చంద్రబాబే 420:
స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు పథకాన్ని 14 మాసాల తర్వాత లోకేష్ చొరవతో నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. ఎన్నికల ముందు చెప్పిన మాట మార్చి ఇవాళ అరాకొర అమలు చేస్తూ మరోసారి మహిళలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నిక ప్రచారంలో ఏం చెప్పారో చూడండి.(ఎన్నికల ప్రచారంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన ప్రచారాన్ని చూపిస్తూ..) మహిళలను ఆకర్షించడం కోసం చేసిన ప్రచారాన్ని చూడవచ్చు. ఇవాళ మీరు చెప్పిన ప్రచారం ప్రకారం మహిళలు వెళ్లడం సాధ్యమా ? మొత్తం 16 వేల బస్సులుంటే 6 వేల బస్సులకే ఉచిత బస్సు ప్రయాణం పధకానికి కేటాయించారు. ఈ 6 వేల బస్సుల్లో జిల్లా దాటి 150 కిలోమీటర్ల పరిధి వరకు ఎక్స్ ప్రెస్ తప్ప మరో బస్సు వెళ్లదు. మరి ఇక్కడ నుంచి మీరు ఎన్నికల ప్రచార యాడ్ లో చెప్పినట్లు కాణిపాకం, హైదరాబాద్ వెళ్లడం సాధ్యమా? మీరు చెప్పిందేమిటి, చేసిందేమిటి చంద్రబాబూ? ఎక్స్ ప్రెస్ మినహా పల్లెవలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ ప్రెస్ పరిధి ఏంటో అందరికీ తెలుసు. కేవలం మీరిచ్చిన హామీలపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత చూసి.. తగ్గిపోతున్న మీ పార్టీ గ్రాఫ్ చూసి భయంతో 14 నెలల తర్వాత ఇచ్చిన వాగ్ధానానికి భిన్నంగా అరాకొరాగా ఈ పధకాన్ని అమలు చేసేందుకు సిద్ధం అయ్యారు. కూటమి ప్రభుత్వం మహిళలను నిలువుగా మోసం చేస్తుంది. ఇన్ని మోసాలు చేస్తున్న మిమ్నల్ని 420 అంటే తప్పేముందు బాబూ?
పర్మిట్ షాపులతో అదనపు దోపిడీ:
కూటమి ప్రభుత్వం లిక్కర్ షాపుల వద్ద పర్మిట్ రూములకు పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మీ లిక్కర్ పాలసీయో పెద్ద స్కామ్. ఇవాల రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం వినియోగాన్ని తగ్గించాలన్న ధృక్ఫధంతో పనిచేసి బెల్టు షాపులు పూర్తిగా రద్దు చేసింది. 2014-19 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4380 ప్రయివేటు మద్యం దుకాణాల సంఖ్యను రద్దు చేసింది. ప్రభుత్వమే మద్యం అమ్మకాలను చేపట్టడం ద్వారా మద్యం విక్రయాలను నియంత్రించే ప్రయత్నం చేశాం. ఇప్పుడు చంద్రబాబు మరలా నాణ్యమైన మందు అని చెబుతున్నాడు. అంటే ఇప్పుడు మద్యం బాటిల్స్ పై నాణ్యమైన మందు అని రాస్తారా? మేం మద్యం సిండికేట్ రద్దు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపులు నిర్వహిస్తే దాన్ని స్కామ్ గా చిత్రీకరిస్తూ అందరినీ అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మద్యం పాలసీ పెట్టే ముందు చంద్రబాబు మద్యం షాపులకు 9.5 నుంచి 10 శాతం మాత్రమే కమిషన్ అని చెప్పారు. దాని ప్రకారం వేలం నిర్వహించిన తర్వాత 14.5 నుంచి 15 శాతానికి కమిషన్ పెంచారు. ఇదంతా ముందస్తుగా కుదుర్చుకున్న బేరమే. మామూళ్ల కోసం మద్యం షాపుల కమిషన్ శాతం పెంచి, నేరుగా వారి నుంచి డబ్బులు గుంజుకునే కార్యక్రమం చేశారు. మద్యం షాపుల దగ్గర పర్మిట్ రూమ్ లకు అనుమతినిస్తూ.. దాన్ని కూడా నిస్సిగ్గుగా సమర్ధించుకుంటున్నారు. రోడ్డు మీద మద్యం తాగకుండా ఉండేందుకే పర్మిట్ రూమ్ లకు అనుమతి అని చెబుతున్నారు. వాటి పేరుతో మరలా అదనపు దోపిడీకి తెరతీశారు. లిక్కర్ విధానం మొత్తం దోపిడీ నడుస్తోంది.
బాబు అధోగతికి నిదర్శనం:
చంద్రబాబు 2014-19 మధ్యలో కూడా లిక్కర్ వ్యవహారంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. 2023లో సీఐడీ దీనిపై పూర్తి ఆధారాలతో నిగ్గు దేల్చి… చంద్రబాబు మీద, అప్పటి ఎక్సైజ్ మంత్రి మీద ఐపీసీ సెక్షన్ 166, 167, 409, 120 బి తో పాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13-1డి, 13-2 ల ప్రకారం కేసులు నమోదు చేశారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ కేసుల్లో బెయిల్ మీద ఉన్నారు. చంద్రబాబు లిక్కర్, సింగపూర్, మహిళల హామీలతో పాటు అన్ని వ్యవహారాల్లో ప్రజలను పచ్చి మోసం చేసే కార్యక్రమానికి దిగజారిపోయారు. పడిపోతున్న కూటమి ప్రభుత్వ గ్రాఫ్ ను పైకి లేపేందుకే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో దుష్టశక్తుల సహాకారం, రౌడీయిజంతో చేస్తూ, ఖాకీ బట్టల సహకారాన్ని వినియోగించుకుని గెలవాలని తాపత్రయపడుతున్నాడు. ఇది బాబు అధోగతికి నిదర్శనం.
లిక్కర్ కేసులో అరెస్టు అయిన వెంకటేశ్వర నాయుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, పెమ్మసానితో కూడా సెల్పీలు దిగాడు. ఈ ఫోటోలో ఆధారాలు అయితే ఆయన దగ్గర దొరికిన డబ్బు వాళ్లేదే. ఎల్లో మీడియా కట్టుకథలు కూడా అతికినట్టు రాయాలి.సిట్ అధికారులు, కోయ ప్రవీణ్ లాంటి ఐపీఎస్ అధికారులు చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ లోకేష్ చెప్పినట్లు చేస్తూ మా పార్టీ నాయకులను ఇరికిస్తున్నారు. ఐపీఎస్ అధికారులతో సహా ఎవరూ చట్టానికి అతీతులు కారన్న విషయం మర్చిపోవద్దు. మీరే నోట్లు కట్టలు పెట్టి ఆధారాలుగా చూపి అరెస్టు చేస్తున్నారు. సిట్ అధికారులు చంద్రబాబు చెప్పిందే చేస్తున్నారని… సక్రమంగా విచారణ చేయకపోతే జైల్లో సిట్టింగ్ వేయాల్సి ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలని అంబటి రాంబాబు హెచ్చరించారు.