ఐబొమ్మ నిర్వాహకుడి వద్ద 50 లక్షల మంది సబ్ స్కైబర్ల డేటా: సజ్జనార్

Spread the love

ఐబొమ్మ నిర్వాహకుడి వద్ద 50 లక్షల మంది సబ్ స్కైబర్ల డేటా: సజ్జనార్

హైదరాబాద్: హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్తో సినీ పెద్దలు భేటీ అయ్యారు. అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జునలతో పాటు దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్రాజు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇటీవల పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీపెద్దలు సజ్జనార్ తో భేటీ అయ్యారు.

అనంతరం సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. పైరసీతో సినీ రంగానికి చాలా నష్టం జరిగిందని తెలిపారు. దీన్ని కట్టడి చేయడంలో భాగంగా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అతడిపై ఐటీ యాక్ట్, కాపీ రైట్ యాక్ట్ కింద మరో 4 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. “పైరసీకి సంబంధించి అంతకు ముందు ప్రశాంత్, శివరాజ్ను కూడా అరెస్టు చేశాం. ఇమ్మడి రవి సమాజానికి చాలా నష్టం చేకూర్చాడు. పైరసీ ద్వారా నష్టం చేయడమే కాకుండా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడు. దీంతో చాలా మంది చనిపోయారు. ఒక వెబ్సైట్ను బ్లాక్ చేస్తే కొత్త సైట్ను తయారు చేశాడు. ఇలా65 మిర్రర్ వెబ్సైట్లు నిర్వహించాడు. 21 వేల సినిమాలు అతడి హార్డ్ డిస్క్ ఉన్నాయి. 1972లో విడుదలైన గాఢ్ఫాదర్ నుంచి మొన్న వచ్చిన ఓజీ వరకు అందులో ఉన్నాయి. రూ.20 కోట్లు పైరసీ ద్వారా సంపాదించాడు. అందులో రూ.3 కోట్లు సీజ్ చేశాం. 50 లక్షల మంది సబైబర్ల డేటా రవి వద్ద ఉంది. ఇంత డేటా అతడి వద్ద ఉండటం ప్రమాదకరం. దీన్ని సైబర్ నేరగాళ్లు వాడుకునే అవకాశం ఉంది” అని సజ్జనార్ వెల్లడించారు.

పోలీసులు వెంటపడ్డాక దేశ పౌరసత్వం వదులుకున్నాడు

“ఇమ్మడి రవి స్వస్థలం (ibomma news today) విశాఖ.. బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడు. అతడు వేరే పేర్లతో మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులు తీసుకున్నాడు. మొదటి నుంచి నేర ప్రవృత్తితో ఉన్నాడు. సినీరంగం అప్రమత్తమై ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు అతడి వెంట పడ్డారు. దీంతో భారత పౌరసత్వాన్ని వదిలి కరేబియన్ దీవుల్లో ఉన్న సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వం తీసుకున్నాడు. ఫ్రాన్స్లో ఉంటూ వివిధ దేశాలు తిరిగేవాడు. 2019లో ఐబొమ్మ ప్రారంభించి 21 వేల సినిమాలు పైరసీ చేశాడు. అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్లో సర్వర్లను పెట్టాడు. 110 డొమైన్స్ కొనుక్కున్నాడు. ఒకటి బ్లాక్ చేస్తే మరొకటి ఓపెన్ చేస్తూ పైరసీ సినిమాలు విడుదల చేశాడు. ఈ రాకెట్లో ఉన్న మిగతా వాళ్లను కూడా బయటకు తీసుకువస్తాం” అని సజ్జనార్ తెలిపారు.

Loading