ఎన్‌టీఆర్ జిల్లా, మే 11, 2024
ఎన్నికల విధుల్లో చిత్తశుద్ధి, నిజాయితీ, నిష్పక్షపాతం ముఖ్యం
– భావితరాలకు స్వచ్ఛమైన ప్రజాస్వామ్య ఫలాలు అందించాలనే తపనతో పనిచేయాలి
– కులం, మతం, రాజకీయం వంటివాటితో సంబంధం లేకుండా
రాజ్యాంగం పట్ల విధేయతతో విధులు నిర్వర్తించాలి
– ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా
ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపుష్టతకు కీలకమైన ఎన్నికల విధుల్లో అధికారులు చిత్తశుద్ధి, నీతినిజాయితీ, నిష్పక్షపాత వైఖరితో పనిచేయడం ముఖ్యమని.. ఇలా ధర్మబద్దంగా ప్రతి ఒక్కరూ విధులు నిర్వర్తించడం వల్ల భావితరాలకు స్వచ్ఛమైన ప్రజాస్వామ్య ఫలాలు అందించగలమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అన్నారు.
శనివారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (శాంతిభద్రతలు) శంఖబ్రత బాగ్చీ, జిల్లా జనరల్ అబ్జర్వర్లు మంజూ రాజ్‌పాల్, నరీందర్ సింగ్ బాలి; విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పోలీస్ అబ్జర్వర్ ప్రీతీందర్ సింగ్, విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం ఎన్నికల వ్యయ పరిశీలకులు వి.జస్టిన్, అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు సౌరభ్ శర్మ, మధన్ కుమార్ తదితరులు హాజరయ్యారు. సమావేశంలో రాష్ట్ర స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ నిబద్ధతతో నాణ్యమైన భద్రత, బందోబస్తు సేవల ద్వారా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం స్ఫూర్తితో శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించవచ్చన్నారు. కులం, మతం, రాజకీయాలు వంటివాటితో సంబంధం లేకుండా నిర్లక్ష్యానికి తావులేకుండా భరతమాతకు, సమాజానికి సేవచేస్తున్నామనే ఉన్నత భావంతో విధులు నిర్వహించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు తదితరాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై పటిష్ట ప్రణాళికతో తక్షణ స్పందన వ్యవస్థ అమలుతో మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేనందున తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అదే విధంగా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణం ఉండేలా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అసాంఘిక శక్తుల కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించే దశలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా స్పష్టం చేశారు.
తొలుత కలెక్టర్ డిల్లీరావు ఈ నెల 13న పోలింగ్ నిర్వహణకు చేసిన ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో ఓటర్లు, పోలింగ్ సిబ్బంది నిర్వహణ, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో సీఏపీఎఫ్ యేతర చర్యలు తదితరాలను వివరించారు. ఈ నెల 12న డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా ఎన్నికల సామగ్రి పంపిణీని పోలింగ్ అధికారులు, సిబ్బందికి అందించి జీపీఎస్ ట్రాకింగ్ వాహనాల్లో పోలీస్ భద్రత మధ్య పోలింగ్ స్టేషన్లకు చేర్చనున్నట్లు తెలిపారు. 17,04,077 మంది ఓటర్లకు సంబంధించి 16,81,670 మందికి ఓటర్ ఇన్ఫర్మేషన్ (వీఐఎస్) స్లిప్‌లను పంపిణీ చేసినట్లు వివరించారు. 22,407 మంది ఓటర్లతో ఏఎస్‌డీ జాబితాలను రూపొందించినట్లు తెలిపారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 1,792 పోలింగ్ స్టేషన్లలో అయిదు పోలింగ్ స్టేషన్లున్న లొకేషన్లు 43, ఆరు పోలింగ్ స్టేషన్లున్న లొకేషన్లు 12, ఆరుకంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్లుఉన్న లొకేషన్లు 38 ఉన్నట్లు వివరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పోలింగ్ స్టేషన్ల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.1201-1500 వరకు ఓటర్లున్న పోలింగ్ స్టేషన్లు 268 ఉన్నాయని.. వీటివద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టర్ డిల్లీరావు వివరించారు.
…
పోలీస్ కమిషనర్ పీహెచ్‌డీ రామకృష్ణ.. భద్రత, సీజర్లు, 12 అంతర్రాష్ట్ర, 10 అంతరజిల్లా చెక్‌పోస్టుల కార్యకలాపాలు, ఎస్ఎస్‌టీ, ఎఫ్ఎస్‌టీల నిఘా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఉల్లంఘనలపై కేసులు తదితరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. మార్చి 16 నుంచి మే 11 వరకు రూ. 13.63 కోట్ల నగదు, రూ. 1.14 కోట్ల విలువైన 18,327 లీటర్ల మద్యం తదితరాలతో పాటు మొత్తం రూ. 17.92 కోట్ల మేర సీజర్లు జరిగినట్లు తెలిపారు. 950 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు, 319 క్రిటికల్ పోలింగ్ లొకేషన్లలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎంసీసీ ఉల్లంఘనలకు సంబంధించి 98 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సీఏపీఎఫ్ బలగాలను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. పటిష్ట కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ పీహెచ్‌డీ రామకృష్ణ వివరించారు.
సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, 16 విభాగాల నోడల్ అధికారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.