ఎన్టీఆర్ జిల్లా, జులై 17, 2025
ఉన్నత కెరీర్ దిశగా ఇష్టపడి చదవండి..
- ఐఐటీ, నీట్ పరీక్షల్లో మంచి ర్యాంకులకు కృషి చేయండి
- ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోండి
- గురుకుల విద్యార్థులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
- పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్
గురుకులం విద్యార్థులు జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని.. వీటిని సద్వినియోగం చేసుకొని, ఇష్టపడి చదివి ఐఐటీ, నీట్ పరీక్షలో మంచి ర్యాంకులు సాధించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
జి.కొండూరు మండలం, కుంటముక్కల డా. బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను కలెక్టర్ లక్ష్మీశ గురువారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. గురుకులం పరిసరాలతో పాటు తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ తదితరాలను పరిశీలించారు. జేఈఈ, నీట్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడారు. కొద్ది రోజుల్లోనే పోటీ పరీక్షల సబ్జెక్టు నిపుణులు కూడా అందుబాటులోకి వస్తారని, బాగా చదువుకొని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యతో కెరీర్ పరంగా ఉన్నత స్థానాలను అందుకోవచ్చన్నారు. విద్యతో పాటు భోజనం, వసతి తదితరాల పరంగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రాజీలేకుండా ప్రాధాన్యమిస్తోందని, ఈ నేపథ్యంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు ప్రణాళిక ప్రకారం ప్రయత్నించాలని.. తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుకునే ఎందరో మంచి స్థానాలకు వెళ్లారని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలన్నారు. గురుకులం పరిసరాలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, విద్యార్థులు ఆహ్లాదకర వాతావరణంలో విద్యాబుద్దులు నేర్చుకునేలా చొరవచూపాలని గురుకులం సిబ్బందికి కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. కలెక్టర్ వెంట గురుకులం వైస్ ప్రిన్సిపల్ ఎన్.సుభాషిణి, సిబ్బంది ఉన్నారు.