ఉద్యోగ అవకాశాల ద్వారా యువతకు బంగారు భవిష్యత్తు.

4
0

 ఎన్టీఆర్ జిల్లా     

తేది: 28.12.2024

ఉద్యోగ అవకాశాల ద్వారా యువతకు బంగారు భవిష్యత్తు.

* ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పించాలన్నదే లక్ష్యం. 

* జాబ్ మేళా ద్వారా జిల్లాలో లక్ష మంది యువతకు ఉద్యోగ అవకాశాలు.

* ఎంపీ కేశినేని శివనాధ్, జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ. 

జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతకు కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని  ఉద్యోగం పొందడంతో పాటు మరొకరికి ఉద్యోగ అవకాశం కల్పించే స్థాయికి యువత ఎదగాలని ప్రముఖ కంపెనీల సహకారంతో జాబ్ మేళాను నిర్వహించి జిల్లాలో లక్ష మంది నిరోద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్, జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.

వికసిత్ భారత్ మెగా జాబ్ మేళా కార్యక్రమంలో భాగంగా శనివారం విజయవాడ పీబీ సిద్దార్ధ పబ్లిక్ స్కూల్ నందు నిర్వహించిన మెగా జాబ్ మేళాను  విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్, జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, శాసన సభ్యులు గద్దె రామ్మోహన్, బోండా ఉమా మహేశ్వరరావులు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో కేశినేని శివనాధ్ మాట్లాడుతూ ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించాలానే లక్ష్యంతో వికసిత్ భారత్ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధిలో వెనుకబడిన మన రాష్ట్రానికి ముందు చూపు కలిగిన ముఖ్యమంత్రి ఉండడం అదృష్టమన్నారు. గతంలో విజన్ 2020 అంటే కొందరికి నమ్మకం కలగలేదని హైదరాబాద్ నగరాన్ని ఐటీ రంగం ద్వారా ఎంతో అభివృద్ధి చేసి లక్షాలాదిమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. విభజన అనంతరం ఏర్పడిన మన రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు నిరుద్యోగ యువత నిర్వీర్యంగా మారారన్నారు. ఈ తరుణంలో  నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా పదవీ భాద్యతలు చేపట్టి టీసీఎస్, రిలయన్స్, గూగుల్, జిందాల్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకున్నారన్నారు.  రాబోయే కాలంలో అమరావతి సర్వీస్ సెక్టార్ గా రూపాంతరం చెందబోతుందన్నారు. రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి చేసి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గం కేంద్రంలో జాబ్ మేళాలు నిర్వహిస్తామని యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దెందుకు జనవరి 5వ తేదిన ఎంఎస్ఎంఈ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కేశినేని శివనాధ్ అన్నారు.     

జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మాట్లాడుతూ నిరుద్యోగ యువత వారికి ఎదురయ్యే ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే జీవితంలో స్థిరపడగలుగుతారన్నారు. యువత తనున్నచోటే ఉద్యోగం  పొందాలనే అపోహను విడనాడి అవకాశాలు ఉన్న చోటకే వెళ్ళి పని చేయగలనన్న మనో ధైర్యాన్ని పెంచుకోవాలన్నారు. జీవితంలో ఎదగాలంటే తాను ఎంచుకున్న కంఫర్ట్ జోన్ను విడనాడాల్సిన అవసరం ఉందన్నారు. యువత అభివృద్ధి చెందడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసే యువత వికసిత్ భారత్ మెగా జాబ్ మేళాను మంచి అవకాశంగా తీసుకోవాలన్నారు. మూడు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అనూహ్యంగా నిరుద్యోగ యువత జాబ్ మేళాకు తరలిరావడం జరిగిందన్నారు. విప్రో, టాటా, పెనాసోనిక్, టెక్ మహేంద్ర, ఫస్ట్ సోర్స్, ఇసుజు, స్మార్ట్ బ్రైన్స్, వరుణ్ మోటార్స్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు వంటి అనేక కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకురావడం అభినందనీయమన్నారు. త్వరలో జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరులలో మెగా జాబ్ మేళాను నిర్వహించడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. 

విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్న ఐదు సంవత్సరాలలో 25 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించి పేదరికాన్ని నిర్మూలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారన్నారు. పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ లు జిల్లాలో మెగా జాబ్ మేళాలను నిర్వహించి రాబోయే రోజులలో 20 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు. పదవ తరగతి నుండి గ్రాడ్యుయేషన్ వరకు చదివిన ప్రతి ఒక్కరికి జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశం లభిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని గద్దె రామ్మోహన్ తెలిపారు. 

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించి పట్టుదలతో పనిచేస్తే ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారన్నారు. జీవితంలో ఏదైనా  సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకుని చిరుద్యోగిగా ప్రస్థానాన్ని మొదలు పెట్టి పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకుని ఆర్ధికంగా స్థిరపడేందుకు యువత కృషి చేయాలన్నారు. ప్రముఖ కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలను కల్పించడం గొప్ప విషయమని యువతకు ఇదొక మంచి అవకాశమన్నారు. రానున్న రోజుల్లో అనేక మల్టీ నేషనల్ కంపెనీలు మన రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించనున్న తరుణంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని బోండా ఉమా మహేశ్వరరావు తెలిపారు. 

వికసిత్ భారత్ మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ఆర్డీవో కావూరి చైతన్య, డీఆర్డీఏ పీడీ కె. శ్రీనివాసరావు, కార్పొరేటర్లు చెన్నుపాటి ఉషారాణి, పొట్లూరి సాయి బాబా,  ముమ్మానేని ప్రసాద్, జాస్తి సాంబశివరావు, దేవినేని అపర్ణ, టెక్ మహేంద్ర ప్రతినిధి  లింగరాజు, స్పాన్ స్పేస్ టెక్నాలజీ  ప్రతినిధి  లక్ష్మి  వివిధ కంపెనీలకు చెందిన  ప్రతినిధులు  పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here