ఉంగుటూరు విజయవాడ రూరల్ మండలాల్లో మినీ పారిశ్రామిక వాడల ఏర్పాటుకు యోచన : యార్లగడ్డ
గన్నవరం :
గన్నవరం నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ఉంగుటూరు, విజయవాడ రూరల్ మండలాల్లోనూ మినీ పారిశ్రామికవాడల ఏర్పాటుకు యోచిస్తున్నట్లు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలోని గాంధీ, బొమ్మ సెంటర్లో జాతిపిత మహాత్మా గాంధీ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారకరామారావుల కాంస్య విగ్రహాల ఏర్పాటుకు మాజీ ఎమ్మెల్యేలు మూల్పూరి బాలకృష్ణారావు, డాక్టర్ దాసరి వెంకట బాలవర్దన్ రావులతో కలిసి శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఉంగుటూరు విజయవాడ రూరల్ మండలంలో పరిశ్రమలు ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించి వాటి వివరాలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలసి అయనతో చర్చించి ఈరెండు మండలాల్లోను మినీ పారిశ్రామికవాడలు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. పరిశ్రమలు ఏర్పాటుకు వస్తున్న డిమాండ్ కు అనుగుణంగా మల్లవల్లి పారిశ్రామికవాడ విస్తరణ కోసం పక్కనే ఉన్న 470 ఎకరాల అసైండ్ భూములను సేకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. వీరపనేనిగూడెంలో పరిశ్రమల ఏర్పాటుకు మరో 49 ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు. నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలో ప్రధాన కోడలిగా ఉన్న గాంధీ బొమ్మ సెంటర్ ను అందంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గాంధీబొమ్మ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు రహదారి విస్తరించి డివైడర్ పై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని, మూడు బొమ్మల సెంటర్లో రహదారికి అడ్డుగా ఉన్న మాజీ ప్రధాన మంత్రుల విగ్రహాలను పక్కకు జరిపి ఉన్నత పాఠశాల ప్రహరీ పక్కనే ఏర్పాటు చేస్తామని ఇప్పటికే చెప్పామని దీనిపై గ్రామపంచాయతీ తీర్మానం కూడా చేశామన్నారు. గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహం ఆలనా పాలనా లేక శిథిలావస్థకు చేరిందని దాన్ని మార్చి సొంత నిధులతో కాంస్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధపడగా ఆర్యవైశ్య సంఘం నాయకులు విగ్రహం ఏర్పాటులో తాము పాలు పంచుకుంటామని ముందుకు వచ్చి నాలుగు లక్షలు ఇచ్చారని యార్లగడ్డ వివరించారు. 2002లో ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్టి రామారావు విగ్రహం ఏర్పాటు చేశారని ఆ విగ్రహం స్థానంలో కాంస్య విగ్రహం ఏర్పాటుకు మళ్ళీ ఎన్టీఆర్ కళాపరిషత్ సభ్యులు నాదెండ్ల మురళి ముందుకు రావడం అభినందనీయమన్నారు. దేశ స్వాతంత్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన గాంధీ మహాత్ముడు, తెలుగుజాతి ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిన మహానుభావుడు ఎన్టీ రామారావు విగ్రహాల ఏర్పాటుకు శంకుస్థాపన చేసే అవకాశం తనకు లభించడం అదృష్టంగా యార్లగడ్డ పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గంలో 11 సంవత్సరాల తర్వాత వ్యవసాయ భూముల మెరక చేసుకునేందుకు, ఇళ్ళు నిర్మించుకునేందుకు స్థానికులకు చెరువుల్లో మట్టి ఉచితంగా ఇస్తున్నప్పటికీ కొంతమంది దాని రాజకీయం చేయటం దురదృష్టకరమన్నారు. ఎక్కడైనా మట్టి విక్రయాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికి నాలుగు మండలాలు తాసిల్దార్లను ఆదేశించినట్లు యార్లగడ్డ గుర్తు చేశారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నానని ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా యార్లగడ్డ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గూడపాటి తులసి మోహన్, గొడ్డళ్ల చిన్న రామారావు, దయాల రాజేశ్వరరావు, కొలుసు రవీంద్ర, టిడిపి రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిరుమామిళ్ల సూర్యం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కమిటీ ఉపాధ్యక్షులు ఆళ్ల గోపాలకృష్ణ, మూల్పూరి సాయి కళ్యాణి, బిజెపి రైతు మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, జనసేన నాయకులు చిమటా రవి వర్మ, ఏఎంసి మాజీ చైర్మన్ కోటగిరి వరప్రసాద్, కొల్లా ఆనంద్, గూడవల్లి నరసయ్య, తులిమిల్లి ఝాన్సీ, కొమ్మరాజు సుధీర్, రంగబాబు, మేడేపల్లి రమ, పలువురు అధికారులు బిజెపి, టిడిపి, జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.