10.03.2025
ఈనెల 12 న యువత పోరుకు తరలిరండి
వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ‘యువత పోరు’కు విద్యార్థులు, యువత, వారి తల్లిదండ్రులు పెద్దఎత్తున తరలిరావాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో ‘యువత పోరు’ పోస్టర్లను డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లతో కలిసి సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్, నిరుద్యోగ భృతి, మెడికల్ కాలేజీల నిర్వహణ అంశాలపై చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తోన్న నిర్లక్ష్య ధోరణిపై ఈనెల 12న కలెక్టర్లకు వినతిపత్రం అందజేస్తామన్నారు. ఇప్పటికే పెంచిన విద్యుత్ ఛార్జీలు, రైతులకు గిట్టుబాటు ధరలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున పోరాటం చేసిందని గుర్తుచేశారు. అలాగే నిరుపేదల విద్య కోసం మరోసారి పోరుబాట పట్టిందని వెల్లడించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 12 న బీసెంట్ రోడ్డులోని పాత కార్యాలయం వద్ద 9 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి తరలివెళ్లడం జరుగుతుందన్నారు. ప్రతిఒక్క పేద విద్యార్థి పెద్దపెద్ద చదువులు చదివి.. ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నది దివంగత మహానేత వైఎస్సార్ ఆకాంక్ష అని.. దానిని గత ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని మల్లాది విష్ణు అన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు. రూ.4,600 కోట్ల బకాయిలు ఇప్పటికీ విడుదల చేయకపోవడంతో విద్యార్థులను యాజమాన్యాలు కళాశాలల నుంచి బయటకు పంపుతున్నారని ఆరోపించారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కుట్ర
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త మెడికల్ కాలేజీల విషయంలో వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని మల్లాది విష్ణు అన్నారు. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను తేవాలన్న సంకల్పంతో గత వైసీపీ ప్రభుత్వంలో రూ.8 వేల కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టగా.. 2023-24 సమయంలోనే 5 కాలేజీలను ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉంటే, ఈ ఏడాది కూడా మరో 5 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చి ఉండేవన్నారు. కానీ కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్ల అది జరగలేదని ఆక్షేపించారు. పైగా అధికారంలో ఉంటూ ఎంబీబీఎస్ సీట్లు పెంచవలసింది పోయి.. మంజూరైన సీట్లు వద్దనడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రారంభమైన మెడికల్ కాలేజీల ద్వారా కొత్తగా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రాగా, ఒక్క పాడేరు కాలేజీలో మాత్రమే 50 సీట్లు వచ్చాయని మల్లాది విష్ణు తెలిపారు. పులివెందుల కాలేజీకి 50 సీట్లు ఇస్తామని జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) ప్రకటిస్తే.. వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం దుర్మార్గమన్నారు. ఎక్కడ వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందన్న దుగ్దతోనే మెడికల్ కాలేజీలను అమ్మేస్తూ నిరుపేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరుద్యోగ భృతి ఏమైంది
నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు.. గత 10 నెలల కాలంలో ఎంతమందికి కల్పించారో సమాధానం చెప్పాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ప్రతినెలా నిరుద్యోగులకు రూ. 3 వేల చొప్పున ఇస్తామన్న భృతి ఏమైందని ప్రశ్నించారు. ఈ ఏడాది బడ్జెట్లో కనీసం ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం యువతను మోసగించడం కాదా..? అని నిప్పులు చెరిగారు. ప్రతీ నిరుద్యోగికి ఈ ప్రభుత్వం రూ. 72 వేలు బాకీ పడిందని తెలియజేశారు.
సూపర్ సిక్స్ ఊసే లేదు
చంద్రబాబు అంటేనే మోసం, దగా, కుట్ర, వంచన అని మల్లాది విష్ణు విమర్శించారు. ఎన్నికల ముందు ఊదరగొట్టిన సూపర్ సిక్స్ పథకాల అమలు ఊసే లేదని ఎద్దేవా చేశారు. అదే వైసీపీ ప్రభుత్వంలో ఏటా సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేసి మరీ.. చెప్పిన తేదీకే లబ్ధిదారుల ఖాతాలలో నేరుగా నగదును జమ చేసినట్లు గుర్తుచేశారు. గత ప్రభుత్వానికి మించి సంక్షేమం అమలు చేస్తామని మభ్యపెట్టిన కూటమి పాలకులు.. తీరా అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీలను తుంగలోకి తొక్కుతున్నారని మండిపడ్డారు.
శాసనమండలి ఎన్నికల ఫలితాలు కూటమికి చెంపపెట్టు
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఓటమి.. కూటమికి చెంపదెబ్బ లాంటిదని మల్లాది విష్ణు అన్నారు. అధికారం ఉందనే అహంకారంతో అరాచకాలు చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలకు విజ్ఞులైన ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారన్నారు. అలాగే ఉమ్మడి గుంటూరు-కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు గట్టిగా బుద్ధి చెప్పారని విష్ణు అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రలోభాలు గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. అయినా కూటమి అభ్యర్థికి తగ్గిన మెజారిటీ.. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తేటతెల్లం చేస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిని విడిచిపెట్టి.. వెంటనే పెండింగ్ బకాయిలను తీర్చి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఊరటనివ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందన్నారు. ఫలితంగా చదువుకోవాల్సిన వారు కూలీలుగా, వ్యవసాయ పనులకు వెళ్లే విషయ పరిస్థితిని కూటమి ప్రభుత్వం కల్పిస్తోందని మండిపడ్డారు. తక్షణమే యువతకు ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు శర్వాణీమూర్తి, ఇసరపు దేవి, ఎండి షాహినా సుల్తానా, పార్టీ అనుబంధ సంఘాల నేతలు, నాయకులు పాల్గొన్నారు.