ఇళ్ల స్థలాల సాధనకు పేదలు కలిసి రావాలి రేపు కలెక్టరేట్‌లో వ్యక్తిగత అర్జీలు సమర్పణ సీపీఐ కార్యదర్శి జి.కోటేశ్వరరావు

4
0

 ఇళ్ల స్థలాల సాధనకు పేదలు కలిసి రావాలి

రేపు కలెక్టరేట్‌లో వ్యక్తిగత అర్జీలు సమర్పణ: సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు

విజయవాడ:

ఇళ్ల స్థలాల సాధన కోసం సీపీఐ చేపట్టిన కార్యక్రమానికి ఇళ్లు లేని పేద వర్గాలు కలిసి రావాలని సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక హనుమాన్‌పేట దాసరి భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కూటమి నేత చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పట్టణల్లో 2 సెంట్లు, గ్రామల్లో 3 సెంట్లు స్థలం, ఇంట నిర్మాణానికి రూ.4లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఇళ్ల స్థలం కేటాయించి పెరిగిన ధరలకు అనుగుణంగా ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేరళ రాష్ట్రంలో హౌసింగ్‌ స్కీమ్‌లో ఈ విధంగా లబ్దిదారులకు ఇస్తున్నట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క సెంటు స్థలం ఇచ్చి లక్షా, 80వేల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇచ్చిందన్నారు. ఒక కుటుంబ నివసించటానికి సెంటు స్థలం సరిపోదని, ఇంటి నిర్మాణానికి లక్షా ఎనబై వేల రూపాయలు సరిపోవని సీపీఐ తరుపున వివరించినట్లు చెప్పారు. సీపీఐ చెప్పిన అంశాలను గత ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జగనన్న కాలనీల్లో ఇల్లు కట్టుకోవాలని కోరినా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు సరిపోక చాలా మంది ఇల్లు కట్టుకోలేదన్నారు. చాలా మందికి కేవలం పత్రాలు మాత్రమే ఇచ్చారని, స్థలం ఎక్కడుందో చెప్పలేదన్నారు. ఆ సందర్భంగా కొంత మంది రూ.35వేలు ప్రభుత్వాన్ని చెల్లించారని తెలిపారు. అదే విధంగా 2019 ఎన్నికలో ముందు ఆనాడు ఉన్న చంద్రబాబు ప్రభుత్వం టిడ్కో ఇళ్లు కేటాయించి పత్రాలు ఇచ్చారు తప్ప ఇల్లు చూపించలేదన్నారు. ఈ విధంగా ఎన్నికల ముందు హడావిడి చేయటం కాకుండా నాలుగున్నర సంవత్సరాల్లో నిర్ధిష్ట ప్రణాళికతో ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం లబ్దిదారులను వేలాదిగా గుర్తించాలని, వారికి అనుకూలమైన ఇంటి స్థలం సేకరించాలని, ఇల్లు లేని పేదలందరికీ న్యాయం జరిగేలా చూడాలన్నారు.  

పేదలకు ఇంటి స్థలం కేటాయించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో ప్రజలు వారి వ్యక్తిగత అర్జీలను కలెక్టర్‌ కార్యాలయంలో 27న సమర్పించేందుకు సన్నద్ధం కావాలని కోరారు. బుధవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్దకు వ్యక్తిగత అర్జీలు తీసుకురావాలని సూచించారు. 

ఈ సమావేశంలో సీపీఐ విజయవాడ నగర సహాయ కార్యదర్శి లంక దుర్గారావు, కార్యదర్శివర్గ సభ్యులు మూలి సాంబ శివ రావు,తాడి పైడియ్య, పంచదార్ల దుర్గాంబ, అప్పురుబోతు రాము, కొట్టు రమణారావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here