ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు దంపతులు
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం ఉదయం మంత్రి అచ్చెన్న దంపతులు ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అచ్చెన్న దంపతులకు ఆలయ ఈవో సీనా నాయక్ అమ్మవారి చిత్రపటాన్ని అందచేశారు.
అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సిరిసంపదలు, సుఖసంతోషాలతో ఉండాలని, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధికి మరిన్ని పెట్టుబడులు రావాలని, పంటలు బాగా పండి, రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి అచ్చెన్న తెలిపారు.