ఆహార భ‌ద్ర‌త చ‌ట్టం అమ‌లుపై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌

Spread the love

ఎన్‌టీఆర్ జిల్లా/విజ‌య‌వాడ‌, మైల‌వ‌రం, తిరువూరు, న‌వంబ‌ర్ 17, 2025

ఆహార భ‌ద్ర‌త చ‌ట్టం అమ‌లుపై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌

  • ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌, మ‌ధ్యాహ్న భోజ‌నంపై ప్ర‌త్యేక దృష్టి
  • చ‌ట్టం స్ఫూర్తితో అధికారులు అడుగులు వేయాలి
  • రాష్ట్ర ఆహార క‌మిష‌న్ ఛైర్మ‌న్ సీహెచ్.విజ‌య ప్ర‌తాప్‌రెడ్డి
  • జిల్లాలో విస్తృతంగా త‌నిఖీలు చేసిన ఆహార క‌మిష‌న్ ఛైర్మ‌న్‌

జాతీయ ఆహార భ‌ద్ర‌త చ‌ట్టం-2013 అమ‌లుపై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటోంద‌ని.. ముఖ్యంగా ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌, మ‌ధ్యాహ్న భోజ‌నం కార్య‌క్ర‌మాల‌పై దృష్టిసారిస్తున్న‌ట్లు రాష్ట్ర ఆహార క‌మిష‌న్ ఛైర్మ‌న్ సీహెచ్.విజ‌య ప్ర‌తాప్‌రెడ్డి అన్నారు.
సోమ‌వారం రాష్ట్ర ఆహార క‌మిష‌న్ ఛైర్మ‌న్ సీహెచ్ విజ‌య ప్ర‌తాప్‌రెడ్డి జిల్లాలో విస్తృతంగా ప‌ర్య‌టించారు. క్షేత్ర‌స్థాయిలో జాతీయ ఆహార భ‌ద్ర‌త చ‌ట్టం అమ‌లు తీరుతెన్నుల‌ను ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించారు. చ‌ట్టం స్ఫూర్తికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది అడుగులు వేసేలా మార్గనిర్దేశ‌నం చేశారు. విజ‌య‌వాడ అర్బ‌న్ ప‌రిధిలోని ప‌ట‌మ‌ట‌లో రెండు అంగ‌న్వాడీ కేంద్రాల‌ను త‌నిఖీ చేశారు. అంగ‌న్వాడీ కేంద్రాల ద్వారా గ‌ర్బిణీలు, చిన్నారులు, బాలింత‌ల‌కు అందుతున్న పోష‌కాహారానికి సంబంధించిన రికార్డుల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం కృష్ణ‌లంక‌లోని పొట్టి శ్రీరాములు మునిసిపల్ హైస్కూల్‌ను సంద‌ర్శించి.. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా చిన్నారుల‌కు అందించేందుకు ఆహారాన్ని సిద్ధం చేస్తుండ‌గా.. క‌మిష‌న్ ఛైర్మ‌న్ స‌రుకుల నాణ్య‌త‌, మెనూ అమ‌లును ప‌రిశీలించారు. సింగ్ న‌గ‌ర్‌లోని ఎంకే బేగ్ పాఠ‌శాల‌ను కూడా త‌నిఖీ చేశారు. తిరువూరులోని బాలిక‌ల ఉన్న‌త పాఠ‌శాల‌తో పాటు ఎస్‌సీ, బీసీ హాస్ట‌ళ్ల‌ను కూడా త‌నిఖీ చేశారు. మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని కుంట‌ముక్క‌ల గురుకుల పాఠ‌శాల‌, వెల‌గ‌లేరు హైస్కూల్‌ను కూడా సంద‌ర్శించి.. కిచెన్‌, డైనింగ్ హాల్‌, స్టోర్ రూమ్ త‌దిత‌రాల‌ను ప‌రిశీలించారు. విద్యార్థుల‌తోనూ మాట్లాడారు.
క్షేత్ర‌స్థాయి త‌నిఖీల్లో భాగంగా పౌర స‌ర‌ఫ‌రాలు, ఐసీడీఎస్‌, విద్యాశాఖ‌, ఆహార భ‌ద్ర‌త, లీగ‌ల్ మెట్రాల‌జీ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో ఆహార క‌మిష‌న్ ఛైర్మ‌న్ విజ‌య ప్ర‌తాప్‌రెడ్డి మాట్లాడారు. చ‌ట్టం అమ‌ల్లో అత్యంత పార‌ద‌ర్శ‌క‌త‌, జ‌వాబుదారీత‌నం ముఖ్య‌మ‌ని.. చ‌ట్టం స్ఫూర్తికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది అడుగులు వేసేలా ఆహార క‌మిష‌న్ ప‌నిచేస్తోంద‌ని తెలిపారు.
కార్య‌క్ర‌మంలో డీఎస్‌వో ఎ.పాపారావు, పౌర స‌ర‌ఫ‌రాల జిల్లా మేనేజ‌ర్ టి.స‌తీష్ కుమార్‌, డీఈవో యూవీ సుబ్బారావు, ఐసీడీఎస్ పీడీ షేక్ రుక్సానా సుల్తానా బేగం త‌దిత‌రులు పాల్గొన్నారు.

Loading