ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు ఆదాయం వచ్చే వాణిజ్య పంటలు సాగుపై రైతులు దృష్టి సారించాలి.మంత్రి నాదెండ్ల మనోహర్,

0
0

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు.

ఆదాయం వచ్చే వాణిజ్య పంటలు సాగుపై రైతులు దృష్టి సారించాలి.

ఆయిల్ పామ్ ,కోకో తో పాటు అంతర్ పంటలు వేసుకుని రైతులు అధిక లాభాలు పొందాలి.

సీతంపేట మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ 2025-26 కార్యక్రమంలో భాగంగా జిల్లా ఇంచార్జ్ ,రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్,జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, రైతులు కలిసి సంయుక్తంగా మొక్కలను నాటారు.

      ఏలూరు/దెందులూరు,జూలై 15:దెందులూరు మండలం సీతంపేట శివారు పంటపొలాలు మధ్యన మంగళవారం  మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ 2025-26 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఇంచార్జ్  మరియు రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 

   ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఇంచార్జ్  మరియు  రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఆదాయం వచ్చే వాణిజ్య పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని  పిలుపునిచ్చారు.దేశంలో వంట నూనెల వినియోగం పెరగడంతో విదేశాల నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నామని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయిల్ పామ్  సాగు ప్రోత్సాహానికి చర్యలు చేపట్టిందన్నారు. ఏలూరు జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా కావడంతో పాటు ఎటువంటి భారీ పరిశ్రమలు లేవన్నారు. సాంప్రదాయ పంటలైన వరి తదితర  పంటలకు ఆదాయం తగ్గిపోవడంతో పాటు తరచూ ప్రకృతి వైపరీత్యాలకు లోనై రైతులు నష్టపోతున్నారని అన్నారు. ఈ సందర్భంలో ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోని మార్కెటింగు సమస్యలేని ఆయిల్ ఫామ్ సాగు రైతులకు మేలు చేస్తుందన్నారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే వాణిజ్య పంటల సాగుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఆయిల్ పామ్ సాగు కోసం ఎకరానికి సుమారు 50,000 రాయితీలు ప్రభుత్వ అందిస్తుందన్నారు. తోటలో అంతరపంటల సాగుకు అవకాశం ఉంటుందన్నారు.చీడపీడల బెడద తక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు.మొక్క నాటిన నాలుగో ఏడాది నుంచే ఉత్పత్తి మొదలై 30 ఏళ్ల వరకు ఆదాయం పొందవచ్చన్నారు. రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలని కోరారు. అంతర పంటలతో కలిపి ఆయిల్ పామ్ సాగు వల్ల ఎకరాకు సుమారు రెండు లక్షల వరకు ఆదాయం పొందవచ్చని తెలిపారు.ప్రతి రైతుకు 50×40 సైజు టార్పాఇన్లు ఖరీఫ్ పంట లోపుగా 50 శాతం సబ్సిడీతో అందిస్తామని తెలిపారు. ఫామ్ ఆయిల్ పంటలతో 300 రకాలు పైగా ఉపయోగాలు ఉన్నాయని,  ఆయిల్ పామ్ , కోకో సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని,ప్రతి రైతు ఆదాయాన్ని ఇచ్చే పంటల మీద దృష్టి పెట్టాలని జిల్లా ఇంచార్జ్ , రాష్ట్ర పౌర సరఫరాలు శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.

 దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ  దెందులూరు మండలంలో అనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు, ఈరోజు ఇన్చార్జి మంత్రిగా నాదెండ్ల మనోహర్ ఫామ్ ఆయిల్ మొక్కలను నాటారని సందర్భంగా గుర్తు చేశారు. డెల్టా ప్రాంతంలో కూడా  ఆయిల్ పామ్ , కోకో సాగుపై ప్రమోట్ చెయ్యాలని సూచించారు.  ఆయిల్ పామ్  గెలలు కోసే సమయంలో నిరుపేదలు కరెంటు షాక్ గురై మరణిస్తున్నారని, పూర్తి సబ్సిడీతో గెలలు కోసే కరెంటు ప్రవహించని పరికరాలను అందించాలని అన్నారు. కాలువలు కట్టే సమయంలో  ఆయిల్ పామ్  సాగుకు కనీసం నెలకు  రెండు గాని మూడు తడులు పెట్టుకునే విధంగా సాగునీరు అందించాలని అన్నారు. ఫారెస్ట్ డెవలప్మెంటు కార్పొరేషన్ పరిధిలో వేలాది ఏకరాలు నిరుపయోగంగా ఉందని,ఆ భూమిని సన్న చిన్న కారు రైతులకు ఐదు ఏకరాలు చొప్పున లీజుకి ఇచ్చినట్లయితే వారు పంటలు పండించుకుంటారని, వారికి చక్కని ఆదాయం, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అన్నారు.

సీతంపేట పంట పొలాలలో డ్రోన్లు సాయంతో మందులు స్ప్రే చేస్తున్న విధానాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్,జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి, శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు. అనంతరం ఇటీవల విద్యుత్ఘాతంతో మరణించిన కుటుంబానికి స్థానిక దాతలు అందించిన 10 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు మంత్రి అందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, విజయవాడ ప్రాంతీయ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి యస్. రామ్మోహన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ భాషా,వివిధ శాఖల మండల అధికారులు రైతులు,స్థానిక ప్రజలు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here