
‘ఆప్కో’లోని స్టాక్ తో నూతన డిజైన్లు
- రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
- ఆప్కో గోడౌన్ లో రూ.15 కోట్ల వస్త్రాల స్టాక్
- ఆ స్టాక్ తో చిన్న పిల్లల ఫ్రాగ్ లు, రెడీమేడ్ చీరలు, పంచెలు, క్యారీ బ్యాగ్ ల తయారీ
- ఒక వైపు త్వరగా స్టాక్ అమ్మకాలు..మరో వైపు మహిళలకు ఉపాధి కల్పన
- ఉనికి కోసం జగన్ డ్రామాలు : మంత్రి సవిత ఫైర్
- మంగళగిరిలోని యర్రబాలెం ఆప్కో గోడౌన్ లో మంత్రి సవిత ఆకస్మిక తనిఖీలు
మంగళగిరి/అమరావతి : చేనేత వస్త్రాల స్టాక్ తో కొత్త డిజైన్లతో చిన్న పిల్లల ఫ్రాగ్ లు, రెడీమేడ్ చీరలు, పంచెలు క్యారీ బ్యాగ్ లు తయారు చేసి కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరలోని యర్రబాలెం ఆప్కో గోడౌన్ ను రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాతో కలిసి మంత్రి సవిత గురువారం పరిశీలించారు. గోడౌన్ లో ఉన్న స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రూ.15 కోట్ల విలువైన వస్త్రాలు గోడౌన్ లో ఉన్నట్లు ఆప్కో మేనేజర్ మనోజ్ కుమార్ తెలిపారు. 96 ఆప్కో షో రూమ్ లకు గానూ 93 షో రూమ్ ల నుంచి రూ.13.48 కోట్లకుపై గా స్టాక్ వెనక్కి తెప్పించామని మిగిలిన మూడు షో రూమ్ ల నుంచి త్వరలోనే స్టాక్ రానుందని ఆయన తెలిపారు. గోడౌన్ లో ఉన్న రూ.కోటీ 60 లక్షల మేర స్టాక్ తో కలిపి రూ.15 కోట్లకు పైగా విలువైన వస్త్రాలు ఉన్నాయన్నారు. స్టాక్ వస్త్రాలను పరిశీలించిన మంత్రి సవిత… ఆ దుస్తులను గ్రేడింగ్ గా విభజించి, డ్యామేజీ కాని వస్త్రాలను రీ సేల్ కు పంపాలని ఆదేశించారు. అవసరమైతే, సబ్సిడీ ధరలపై విక్రయించాలని స్పష్టంచేశారు. ఏయే జిల్లాల నుంచి ఎంతెంత మేర స్టాక్ వెనక్కి తెప్పించారని అడిగి తెలుసుకున్నారు. మిగిలిన షో రూమ్ ల నుంచి త్వరగా స్టాక్ తెప్పించాలని స్పష్టం చేశారు. గోదాములో ఉన్న స్టాక్ తో చిన్నపిల్లల ఫ్రాగ్ లు, రెడీమేడ్ చీరలు, పంచెలు, క్యారీ బ్యాగ్ ల తయారీని మంత్రి సవిత పరిశీలించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఆప్కో గోడౌన్ లో రూ.15 కోట్ల మేర స్టాక్ ఉందన్నారు. ఈ స్టాక్ తో ప్రస్తుత అభిరుచులకు అనుగుణంగా రెడీమేడ్ దుస్తులు, క్యారీ బ్యాగ్ లు తయారు చేస్తున్నామన్నారు. ప్రస్తుతమున్న స్టాక్ విక్రయించడమే కాకుండా, చేనేత మహిళలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం కొందరు డిజైనర్లను నియమించుకున్నామన్నారు. వారితో మహిళలకు రెడీ మేడ్ దుస్తులు, క్యారీ బ్యాగ్ ల తయారీపై శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఆప్కో గోడౌన్, షో రూమ్ ల్లో ఉన్న స్టాక్ ను వీలైనంత త్వరగా విక్రయాలు జరిపాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.
ఉనికి కోసం జగన్ డ్రామాలు…
రాజకీయ ఉనికి కోసం జగన్ డ్రామాలు ఆడుతున్నాడని మంత్రి సవిత మండిపడ్డారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ ఏరోజూ రైతులు, బీసీల గురించి ఆలోచించే పాపాన పోలేదన్నారు. అయిదేళ్ల పాలనలో ఏనాడూ బురదలోకిగాని, నీటమునిగిన పొల్లాలోకిగాని దిగి తుఫాన్ బాధితులను పరామర్శించిన దాఖాలాల్లేవన్నారు. ఇప్పుడు కూడా తుఫాన్ వెళ్లిపోయిన వారం రోజుల తరవాత తీరిగ్గా వచ్చి రైతులను ఓదార్చే డ్రామాకు తెరతీశాడన్నారు. బీసీలను తీవ్రంగా వేధించిన వ్యక్తి జగన్ రెడ్డి అని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ అసమర్థ పాలనను విమర్శించినందుకు ఎందరో బీసీ నేతలపై తప్పుడు కేసులు బనాయించి, జైళ్లో అక్రమంగా బంధించాడన్నారు. జోగి రమేష్ అరెస్టుతో జగన్ కు బీసీలు గుర్తుకొచ్చారని ఎద్దేవా చేశారు. కల్తీ మద్యం తయారీలో జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు ఆ కేసులు ఏ1 నిందితుడిగా ఉన్న జనార్దనరావు పోలీసులకు తెలిపాడన్నారు. తాను, జనార్ధనరావు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని జోగి రమేష్ చెబుతున్నాడన్నారు. జనార్దనరావుకు, జోగి రమేష్ కు సంబంధమే లేదని జగన్ అంటున్నాడని, వారిద్దరిలో ఎవరి మాట జనాలు నమ్మాలని మంత్రి సవిత ప్రశ్నించారు. బీసీ కార్డుతో జగన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడని, ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితుల్లోకి లేరని మంత్రి సవిత అన్నారు.
![]()
