ఆకుపచ్చని గన్నవరం లక్ష్యం యార్లగడ్డఅక్రమ కేసులు అనేవాళ్ళు అప్పట్లో ఏపార్టీలో ఉన్నారు గన్నవరం : నియోజకవర్గంలో పచ్చదనం పెంపొందించేదుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ తెలిపారు. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్లో గురువారం ఉదయం మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమాన్ని యార్లగడ్డ ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారిపై గన్నవరం నియోజవర్గంలోని గ్రామాలతోపాటు నియోజకవర్గం ప్రారంభ గ్రామమైన రామవరపాడు నుంచి చివరి గ్రామమైన బొమ్మలూరు వరకు పచ్చదనాన్ని పెంపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే బాపులపాడు లో మొక్కలు నాటామని, గన్నవరంలోనూ మొక్కలు నాటుతున్నామని, మరో 10 రోజుల్లోనూ రామవరపాడులోనూ మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామని వివరించారు. గతంలో గన్నవరం విమానాశ్రయం నుంచి రామవరప్పాడు వరకు 45వేల చదరపు మీటర్లు ఉన్న పచ్చదనాన్ని మరో 45వేల చదరపు అడుగులకు పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో 427 పరిశ్రమలకు భూములు కేటాయించామని భూమి కేటాయించిన తర్వాత 18 నెలల్లో పరిశ్రమ ప్రారంభించకపోతే భూ కేటాయింపులను రద్దు చేస్తామని హెచ్చరించారు. మల్లవల్లి లో ప్రస్తుతం ఉన్న పారిశ్రమికవాడకు అదనంగా మరో 450 ఎకరాల భూమిని పరిశ్రమలకు కేటాయించనున్నట్లు యార్లగడ్డ తెలిపారు. వీరపనేని గూడెంలో పరిశ్రమల ఏర్పాటుకు 50 ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చిందన్నారు. ఆసక్తి గల పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గన్నవరంలో అక్రమ కేసులు పెడుతున్నారన్న వైసీపీ నాయకుల ఆరోపణలను యార్లగడ్డ వద్ద మీడియా ప్రస్తావించగా ప్రస్తుతం వైసిపి నాయకులు చెబుతున్న కేసులన్నీ వైసీపీ ప్రభుత్వంలో పెట్టినవేనని గుర్తు చేశారు. టిడిపి కార్యాలయం దాడి, నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ ఈ రెండు కేసులు వైసీపీ ప్రభుత్వంలోనే నమోదు చేసారని చెప్పారు. మినప చేను తొక్కించారంటు జగన్మోహన్ రెడ్డి పై కేసులు పెట్టింది ఎవరని ప్రశ్నించారు. అక్రమ కేసులు అంటున్న వారంతా అప్పట్లో ఏ పార్టీలో ఉన్నారని సూటిగా ప్రశ్నించారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అక్రమ కేసు కూడా పెట్టలేదని తన స్థాయికి తగ్గ వాళ్ళు వస్తే దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని యార్లగడ్డ సవాల్ చేశారు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసిపి పాలకులు సాగునీటి రంగాన్ని గాలికి వదిలేయడంతో బుడమేరుతోపాటు, పంట కాలవలకు గండ్లు పడి సాగునీటి ఇబ్బందులు తప్పటం లేదన్నారు. పంట కాలువలకు గత ఐదేళ్లుగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో కాలువలు గండ్లు పడి సాగునీటి ప్రవాహానికి ఇబ్బందిగా ఉందన్నారు. యుద్ద ప్రాతిపదికన కాలువల మరమ్మతులు పూర్తి చేసిన అనంతరం సాగునీటి విడుదల చేయనున్నట్లు యార్లగడ్డ వివరించారు. రోగుల సౌకర్యార్థం కానూరు శేష మాధవి ఏర్పాటు చేసిన అంబులెన్స్ ను యార్లగడ్డ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నిడమర్తి సౌజన్య, బిజెపి నాయకులు చిగురుపాటి కుమారస్వామి, నాదెండ్ల మోహన్, టిడిపి నాయకులు దొంతు చిన్న, ఆళ్ల గోపాలకృష్ణ, మద్దినేని వెంకటేశ్వరరావు, కొమ్మరాజు సుధీర్, మేడేపల్లి రమ, మొవ్వ వెంకటేశ్వరావు, కొమ్మారెడ్డి రాజేష్, ఆరుమళ్ళ కృష్ణారెడ్డి, గొడ్డళ్ళ చిన్న రామారావు, మూల్పూరి సాయి కళ్యాణి, పడమట రంగారావు,పాలడుగు మల్లికార్జునరావు, యానమదల సతీష్ తదితర టిడిపి నాయకులు అధికారులు పాల్గొన్నారు.