ఎన్‌టీఆర్ జిల్లా, జూన్ 23, 2025
అర్జీల పరిష్కారంలో నాణ్యతకు ప్రాధాన్యమివ్వండి..
- అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలకు పరిష్కారం చూపండి..
- అర్జీల పరిష్కారంలో అలసత్వాన్ని సహించను..
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
అర్జీల పరిష్కారంలో నాణ్యతకు, సంతృప్తి స్థాయికి ప్రాధాన్యమివ్వాలని, అలసత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోనని పునరావృతం కాకుండా అర్జీలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కార మార్గం లభిస్తుందని ఎంతో ఆశతో గ్రీవెన్స్ సెల్‌ను ఆశ్రయిస్తున్నారన్నారు. వారి నమ్మకానికి మరింత బలం చేకూర్చే విధంగా నాణ్యతా ప్రమాణాలతో పునరావృతం కాకుండా ఆర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్థేశించిన సమయానికి సమస్యలకు పరిష్కారం చూపాల్సిందేనని ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించినా సహించబోనని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. మానవతాదృక్పథంతో సానుకూలతతో సమస్యలను పరిష్కరించడంపై దృష్టిపెట్టాలన్నారు. స్వీకరించిన ఆర్జీలకు సంబంధించి కిందిస్థాయి అధికారులు సిబ్బంది నుండి స్పష్టమైన సమాచారం తీసుకుని సమస్యలను పరిష్కరించి అర్జిదారులను సంతృప్తి పరచడమే లక్ష్యంగా అధికారులు పనిచేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నేరవేర్చాలన్నారు. ఇకపై ఆర్జీల పరిష్కారంపై తాను ప్రతి రోజు సమీక్ష నిర్వహిస్తానని ఆర్జీల పరిష్కారంలో సరైన కారణం లేకుండా జాప్యం జరిగినా, నాణ్యత లేకున్నా చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
189 అర్జీల స్వీకరణ:
రెవెన్యూ శాఖకు సంబంధించి 93, పోలీస్ శాఖకు 22, విద్య 12, ఎంఏయూడీ 10, అటవీ 5, పంచాయతీరాజ్ 5, సర్వే 5, రిజిస్టేషన్ అండ్ స్టాంప్స్ 4, ఏపిఎస్‌డబ్ల్యుఆర్‌ఇఐఎస్ 3, హౌసింగ్ 3, గ్రామీణ నీటి సరఫరా 3, వ్యవసాయం 2, సహకార శాఖ 2, విభిన్న ప్రతిభావంతులు 2, డీఆర్‌డీఏ పీడీ 2, ఉపాధి హామీ 2, హెల్త్ 2, విద్యుత్, పౌరసరఫరాలు, కళాశాల విద్య, డ్వామా, మత్య్స, జలవనరులు, కేడీసీసీ సీఈవో, కార్మిక శాఖ, బ్యాంకు, గనులు, ఆర్ అండ్ బీ, సాంకేతిక విద్యకు సంబంధించిన ఒక్కో అర్జీతో కలిపి మొత్తం 189 అర్జీలను స్వీకరించడం జరిగిందని కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు.
అర్జీల స్వీకరణలో గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ మహేశ్వరరావు, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.