అర్జీల పరిష్కారంలో అలసత్వాన్ని సహించను..

Spread the love

విజయవాడ, న‌వంబ‌ర్ 03, 2025

అర్జీల పరిష్కారంలో అలసత్వాన్ని సహించను..

  • అనుమతి లేకుండా గ్రీవెన్స్కు గైర్హాజరయితే చర్యలు తప్పవు…
  • అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలకు పరిష్కారం చూపాల్సిందే..
  • జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

ఆర్జీల పరిష్కారంలో అలసత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లోను సహించబోనని పునరావృతం కాకుండా అర్జీలకు పరిష్కారం చూపాల్సిందేనని, అనుమతి లేకుండా గ్రీవెన్స్కు గైర్హాజరయితే చర్యలు తప్పవని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులను హెచ్చ‌రించారు.
పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆర్జీదారుడు పెట్టుకున్న నమ్మకానికి బలం చేకూర్చేవిధంగా ఆర్జీలను పరిష్కరించి ప్రభుత్వ ఆశయాన్ని నేరవేర్చాల్సిన భాధ్యత అధికారులపై ఉందన్నారు. ఆర్జీదారుడు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు దృష్టిపెట్టి పరిష్కార మార్గం చూపాలన్న కృత‌నిశ్చ‌యంతో ఉన్నప్పుడే ఆర్జీల పరిష్కారం అవుతాయన్నారు. అధికారులను కలిసేందుకు శ్రమకోర్చి ఎంతో ఆశతో గ్రీవెన్స్ సెల్‌ను ఆశ్రయించేందుకు వస్తున్నారన్నారు. ఆర్జీలు తీసుకునే సమయంలో సంబంధిత అధికారులు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉన్న తరుణంలో కొందరు అధికారులు పైఅధికారుల అనుమతి లేకుండా గ్రీవెన్స్కు గైర్హాజరు కావ‌డం, సమయ పాలన పాటించకపోవడం వంటివి తన దృష్టికి వస్తే సహించేది లేదన్నారు. ఆర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతా ప్రమాణాలతో ఆర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్దేశించిన సమయానికి సమస్యలకు పరిష్కారం చూపాల్సిందేనని.. ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించినా సహించబోనని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. సానుకూలతతో సమస్యలను పరిష్కరించడంపై దృష్టిపెట్టాలన్నారు. స్వీకరించిన ఆర్జీలకు సంబంధించి కిందిస్థాయి అధికారులు, సిబ్బంది నుండి స్పష్టమైన సమాచారం తీసుకుని సమస్యలను పరిష్కరించి అర్జీదారులను సంతృప్తి పరచడమే లక్ష్యంగా అధికారులు పనితీరు ఉండాలన్నారు. ఆర్జీల పరిష్కారంపై తాను ప్రతి రోజు సమీక్ష నిర్వహిస్తానని, ఆర్జీల పరిష్కారంలో సరైన కారణం లేకుండా జాప్యం చేస్తే, నాణ్యత లేకున్నా సంబంధిత అధికారుల‌పై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ స్ప‌ష్టం చేశారు.
కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ ద్వారా ఆర్జీలు ప్రజల నుండి 194 ఆర్జీలను స్వీకరించారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహాం, డిఆర్డిఏ పిడి ఏఎన్వి నాంచారరావు. గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి. జ్వోతి వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Loading