ఎన్‌టీఆర్ జిల్లా, జులై 28, 2025
అపోహలు తొలగించి.. ఆయుష్ పోయండి..
- ప్రాచీన వైద్య విధానం మన దేశ వారసత్వ సంపద
- ఆరోగ్య ఆంధ్ర, స్వర్ణాంధ్ర సాకారానికి కలిసికట్టుగా అడుగులేద్దాం
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ప్రాచీన వైద్య విధానం మన దేశ వారసత్వ సంపద అని.. ఆయుర్వేదం, యోగా, ప్రకృతివైద్యం, యునాని, సిద్ధ, హోమియోపతి (ఆయుష్)పై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించి, ప్రభుత్వాల చొరవ, ఏర్పాట్లను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులకు సూచించారు.
సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఇగ్నైట్ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఆయుష్ వైద్యులు పీజీఆర్ఎస్ కార్యక్రమానికి హాజరైన వారితో పాటు కలెక్టరేట్ సందర్శకులకు సంప్రదాయ వైద్య విధానాల విశిష్టతను వివరించడంతో పాటు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ద్వారా 130 మందిని పరీక్షించి, ఔషధాలు అందించారు. కలెక్టర్ లక్ష్మీశ ఇగ్నైట్ సెల్‌ను సందర్శించి ఆయుష్ వైద్యులకు వివిధ సూచనలు చేశారు. జిల్లాలో ఏడు ఆయుష్మాన్ మందిర్‌లు, ఆరు ఆయుష్ డిస్పెన్సరీలు ఉన్నాయని.. అదేవిధంగా విజయవాడలో డా. ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, డా. నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఉన్నాయని, వీటిద్వారా మెరుగైన సేవలు అందించేలా అధికారులు కృషిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సుసంపన్న, ఆరోగ్య, ఆనంద ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ @ 2047ను ఆవిష్కరించడం జరిగిందని.. ఆరోగ్య ఆంధ్ర సాధనలో ఆయుష్ విభాగం కూడా కీలకపాత్ర పోషించాలని సూచించారు. ఇటీవల యోగా ఔన్నత్యాన్ని ప్రజలందరికీ చేరువచేసి, ఆరోగ్య ఫలాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర మాసోత్సవాలు విజయవంతమయ్యాయని, ఇదే స్ఫూర్తితో ఇతర ప్రాచీన వైద్య విధానాలను భావితరాలకు అందించేందుకు సమష్టిగా అడుగులేద్దామని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డా. వై.రత్న ప్రియదర్శిని, డా. పి.సుకన్య, డా. మొహమ్మద్ జునీద్, డా. విష్ణువర్ధన్, పీజీ స్కాలర్లు, హౌస్ సర్జన్లు తదితరులు పాల్గొన్నారు.