అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపల హంద్రీనీవా కాలువని రెండింతల సామర్థ్యానికి పెంచాం
- : రాష్ట్రానికి మంత్రినైనా ఉరవకొండ నియోజకవర్గం అభివృద్ధికి మొదటి కూలీగానే పని చేస్తా..
- : రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్
అనంతపురం, ఆగస్టు 08 :
- తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపల హంద్రీనీవా కాలువని రెండింతల సామర్థ్యానికి పెంచామని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. శుక్రవారం వజ్రకరూరు మండలం శ్రీరామనగర్ మజారా పదవ వార్డు (బొడిసానిపల్లి) గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి, నాగప్రతిష్ట, ధ్వజస్తంభ శిఖర మరియు గ్రామశిల ప్రతిష్ట మరియు శ్రీరామనగర్ కాలనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలోన్ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.
- ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఈ శుభ కార్యక్రమంలో పాలుపంచుకోవడం చాలా సంతోషం అన్నారు. శ్రీ ఆంజనేయ స్వామి గుడి ప్రారంభోత్సవం మరియు కొత్తగా ఒక గ్రామం 40 ఏళ్లు నివసించేలా ఏర్పాటు చేసుకోవడం ఆనందకరమన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా అందులో పాలు పంచుకోవడం తనకెంతో సంతోషమని, 1994 నుంచి ఇప్పటివరకు రాజకీయ అభివృద్ధిలో, ప్రతి దశలో ప్రజలంతా నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారన్నారు. రాజకీయ ఎదుగుదలలో ఇంతటి మహోన్నత స్థాయికి తీసుకురావడానికి సహకరించిన నాయకులకు, ఉరవకొండ నియోజకవర్గం ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి మొదటి కూలీగానే పని చేస్తానని తాను ఎప్పుడూ చెబుతూ ఉంటానని, సమస్యలను పరిష్కారం చేయాలంటే నాపై ఉన్న నమ్మకం ఏ మాత్రం వమ్ము కానీయకుండా, మీ అందరి ఆశలు, ఆకాంక్షల్ని తీర్చడానికి భగవంతుడు శక్తి ఇచ్చిన మేరకు తాను పనిచేస్తానన్నారు. మనుషులకు చేపలు తెచ్చి పెట్టడం కాదు.. చేపలు పట్టడం నేర్పించమని కార్ల్ మార్క్స్ చెప్పారని, మనుషులను వారి కాళ్లపై వాళ్లు నిలబడేలా చేయాలన్నారు. 2019 ఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉరవకొండకి వచ్చి అధికారంలోకి వస్తే మూడు నెలల్లో హంద్రీనీవా పనులు ప్రారంభిస్తామని చెప్పారని, అయితే ఐదేళ్లలో ఒక గంప మన్ను తీయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపల ఆరు మోటర్ల నుంచి 12 మోటర్లకు వాడుకునేలా కాలువని రెండింతల సామర్థ్యానికి తీసుకువెళ్లడం జరిగిందని, అది తమ ప్రభుత్వానికి ఉరవకొండ నియోజకవర్గం అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధి అన్నారు. తాను ఎక్కడ ఉన్న తన మనసు ఇక్కడే ఉంటుందని, నియోజకవర్గ అభివృద్ధిలో పాలుపంచుకుంటానన్నారు. ఈరోజు హంద్రీనీవా మెయిన్ కెనాల్ ని పూర్తి చేశామని, తర్వాత పిల్ల కాలువలకు వెళతామని, రోడ్లు వేస్తున్నామని, స్కూల్ భవనాలను రూపుదిద్దే ప్రయత్నం చేస్తున్నామని, చెప్పినట్టుగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇచ్చామని, పెన్షన్లను 4,000 చేశామన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడంలో రూపాయి ఎలా తీసుకురావాలి, ఎలా ఖర్చు పెట్టాలో నేర్పించే మహిళలే తనకు స్ఫూర్తి అని అన్నారు. 10 లక్షల కోట్ల అప్పు ఉండి, లక్ష కోట్ల బిల్లులున్నా ఉన్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పెన్షన్ల పెంపు పథకాలన్నీ అమలు చేస్తున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తాము ప్రజల కోసమే కష్టమైన పని చేస్తున్నామన్నారు. ప్రజలు, రైతుల జీవితాల్లో వెలుగు రావాలని హంద్రీనీవా కాలువని వెడల్పు చేశామని, తాను వస్తూ కాలవలో నీళ్లు చూస్తే సంతోషం వేసిందన్నారు. గతంలో అభివృద్ధి పనులు చేయలేదని, గతానికంటే రెండింతలు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనునిత్యం చెబుతున్నారని, అందుకు అనుగుణంగా భవిష్యత్తు కోసం, రేపటి తరం కోసం తాము కష్టపడి పని చేస్తున్నామన్నారు. రైతులు, మహిళల జీవితాల్లో మార్పు రావాలని లక్ష్యంగా కృషి చేస్తున్నామని, చెప్పినటువంటి మాటను ఎంత కష్టమైనా నిలబెట్టుకుంటామన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో అభివృద్ధిని ఇప్పటికే పరుగులు పెట్టిస్తున్నామన్నారు. గత ఐదేళ్లలో ఉరవకొండ పట్టణంలో 15 రోజులకు ఒకసారి నీళ్లు ఇచ్చేవారని, తమ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం కాలంలోనే, నూరు రోజుల్లోనే తాము పని చేసి రోజు విడిచి రోజు ఉరవకొండ పట్టణంలో నీరు వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గం అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.