అత్తింటి వేధింపుల వెనక వైసీపీ నేతలు
జనసేన కేంద్ర కార్యాలయంలో జనవాణిలో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్
నా భర్త చనిపోయిన తర్వాత ఆయన ఆస్తి నాకు దక్కకుండా అత్తింటి వారు వేధిస్తున్నారని, వారికి వైసీపీ నాయకుల అండదండలున్నాయని ఓ మహిళ తన ఆవేదనను జనవాణిలో పంచుకున్నారు. 15 ఏళ్ల కుమార్తె అదృశ్యం అయితే కనీసం పోలీసులు నాలుగు నెలల నుంచి దాన్ని పట్టించుకోవడం లేదంటూ మరో తల్లి మనసు తన కన్నీటిని జనవాణి వేదికగా చెప్పుకొని బాధపడింది. జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి బాధితులు తమ బాధలు చెప్పుకొనేందుకు సోమవారం తరలివచ్చారు. వారి వేదనలను ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ విన్నారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి, బాధితులతో మాట్లాడారు. కొన్ని ఫిర్యాదులపై అప్పటికప్పుడే స్పందించి అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపారు.
• సామర్లకోట మండలం, పవరలో తన భర్తకు చెందిన మూడు సెంట్ల భూమి, దానిలో ఇల్లు ఉందని, అయితే ఆయన మరణించిన తర్వాత తనకు రావాల్సిన భూమిని ఇవ్వడం లేదని పిట్టా సుజాత అనే మహిళ వాపోయారు. అత్తింటివారు తనకు ఇవ్వాల్సిన భూమి, ఇల్లు ఇవ్వడం లేదని, దీనికి వైసీపీ నాయకులు మద్దతు ఉందని చెప్పింది. పోలీసు కేసు గతంలో పెట్టినా సరైన న్యాయం జరగలేదని, తగిన న్యాయం చేయాలని కోరారు.
• విజయవాడ మండలం, అంబాపురం, వైఎస్సార్ కాలనీల్లో ఇటీవల వచ్చిన వరదకు సర్వం కోల్పోయామని రత్నం, మేరీ అనే మహిళలు కన్నీటి పర్యంతం అయ్యారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం అందలేదని, తగిన సాయం అందజేయాలని కోరారు.
• కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం, నవాబుపేటకు చెందిన శ్రీమతి గొల్లపల్లి కుసుమకుమారి తన 15 ఏళ్ల ఆడబిడ్డ అదృశ్యం అయిందని, పోలీసులు పట్టించుకోవడం లేదని చెప్పారు. అదే గ్రామానికి చెందిన కోడిమెళ్ల సురేష్ పై అనుమానం ఉందని చెప్పినా పోలీసులు న్యాయం చేయడం లేదని గోడు వెళ్లబోసుకున్నారు.
• 2022లో జపాన్ లో జరిగిన ఆసియా కప్ సాఫ్ట్ బాల్ టోర్నమెంటులో దేశానికి ప్రాతినిధ్యం వహించానని, అయినా నేటికి సరైన భృతి లేదని సత్యసాయ జిల్లా, యలకుండ్ల గ్రామ యువకుడు భరత్ చంద్ర ఆవేదన చెందాడు. తాను మరికొందరు ఆటగాళ్లను తయారు చేసే సామర్థ్యం ఉందని, తనకు తగిన ఉపాధి చూపాలని కోరారు.
• నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలం, వావింటపర్తి సర్పంచి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వలేదనే నెపంతో కక్షసాధింపు చర్యలకు దిగాడని గొరిపర్తి అశోక్ ఫిర్యాదు చేశాడు. నిత్యం తనను వేధిస్తున్నారని సర్పంచి నెట్టెం కృష్ణయ్య, అతడి కుటుంబసభ్యులు కూడా తనను అకారణంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు