పాలసీలో పాదర్శకత…మద్యంలో నాణ్యత ఇదే ప్రభుత్వ విధానంపేదల జేబులు గుల్ల కాకూడదు…ఆరోగ్యం దెబ్బతినకూడదు

1
0

PRESS RELEASE

పాలసీలో పాదర్శకత…మద్యంలో నాణ్యత ఇదే ప్రభుత్వ విధానం

పేదల జేబులు గుల్ల కాకూడదు…ఆరోగ్యం దెబ్బతినకూడదు

అందుకోసమే దేశంలో ఎక్కడా లేని విధంగా మద్యం ధరల తగ్గింపు

కొత్త విధానంతో అక్రమ మద్యానికి చెక్….పెరిగిన ప్రభుత్వం ఆదాయం

ఎక్సైజ్ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గరే బ్రాండెడ్ మద్యం ధరలు తక్కువన్న అధికారులు

నాణ్యత లేని మద్యం పోవడంతో…ప్రజారోగ్యంలో వచ్చిన మార్పును లెక్కించమన్న సిఎం

అమరావతి,జూలై 14: మద్యం విధానంలో పారదర్శకతే ప్రధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఈ అంశంపై ఎలాంటి రాజీ లేదని ఆయన తేల్చి చెప్పారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో అబ్కారీ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న బ్రాండ్ల విక్రయాలన్నీ నిలిపివేయాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, నాణ్యత ఉన్న మద్యం విక్రయాలు మాత్రమే జరగాలని ఆయన అధికారులకు తేల్చి చెప్పారు. ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటు సారా విక్రయాలు జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రజారోగ్యంపై ప్రభావం పడకుండా నాణ్యమైన మద్యాన్ని మాత్రమే విక్రయించేలా చూడాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున నకిలీ బ్రాండ్లు విక్రయాలు ఆంధ్రప్రదేశ్ లో జరిగాయని తద్వారా ప్రజల ఆరోగ్య పాడైందని అన్నారు.

నకిలీ బ్రాండ్లతో ప్రజారోగ్యంపై ప్రభావం

నకిలీ మద్యం బ్రాండ్ల కారణంగా ట్రేడ్ డైవర్ట్ అయ్యిందని తద్వారా రాష్ట్రం ఆదాయం కోల్పోయిందని అన్నారు. అదే సమయంలో ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతిందని సీఎం అన్నారు. 2014 నుంచి 19 మధ్య అమలైన మద్యం పాలసీ ఎలా ఉంది.. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన విధానం పై అధ్యయనం చేసి నివేదికను ప్రజల ముందు ఉంచాలని సీఎం స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక అమలు చేసిన నూతన మద్యం పాలసీతో ఏపీ రెవెన్యూ పెరిగిందని స్పష్టం చేశారు. గతంలో పొరుగు రాష్ట్రాలకు తరలిపోయిన ఆదాయం ఇప్పుడు రికవరీ వచ్చిందని అన్నారు. గతంలో జే బ్రాండ్ల కారణంగా గంజాయికి, డ్రగ్స్ కు అలవాటు పడ్డారని ..ప్రజారోగ్యంపై తీవ్రంగా ప్రభావం పడిందని అన్నారు. అలాగే స్వార్ధం కోసం గత పాలకులు తెచ్చిన సొంత బ్రాండ్లు ఇప్పుడు కనిపించకుండా పోయాయని అన్నారు. ప్రజలు కూడా దీన్ని గుర్తించారని అన్నారు.

మార్కెట్ లో ఉన్నవి ప్రముఖ బ్రాండ్లే

గత ప్రభుత్వ హయాంలో విక్రయించిన నకిలీ మద్యం బ్రాండ్లను ఎంత వరకు అరికట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాసిరకమైన బ్రాండ్లు ఇంకా ఏమైనా మార్కెట్ లో కొనసాగుతున్నాయా అని సీఎం ఆరా తీశారు. గతంలో విస్తృత స్థాయిలో విక్రయించిన అనామక మద్యం బ్రాండ్లు నూతన పాలసీ అమలు పూర్తిగా తగ్గినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం అన్ని ప్రముఖ బ్రాండ్లు ఇప్పుడు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. గతంలో మార్కెట్లో 68 శాతం మేర అనామక బ్రాండ్లకు చెందిన మద్యమే అందుబాటులో ఉండేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ నాసిరకం బ్రాండ్ల విక్రయం జరక్కుండా చూస్తున్నామని అధికారులు సీఎంకు తెలియచేశారు. దేశీయ, విదేశీ కంపెనీలకు చెందిన ప్రముఖ బ్రాండ్లన్నీ ఏపీ మార్కెట్ లో కొనుగోలు దారులకు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

చరిత్రలో తొలిసారి తగ్గిన మద్యం ధరలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన మద్యం పాలసీ అమలు అనంతరం అబ్కారీ శాఖ చరిత్రలో తొలిసారి మద్యం ధరలు దిగి వచ్చాయి. మద్యం పై గతంతో పోలిస్తే కనీసం రూ.10 – 100 వరకూ ధరలు తగ్గినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పేద ప్రజల జేబులు కొల్లగొట్టేలా ప్రభుత్వం వ్యవహరించకూడదు, దోపిడీ ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా మద్యం ధరలు తగ్గించామని సిఎం అన్నారు. ఈ కారణంగా ప్రతీ నెలా కొనుగోలు దారులపై రూ. 116 కోట్ల రూపాయల మేర భారం తగ్గుతుందని అధికారులు తెలిపారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు తో పోలిస్తే ఏపీలో విక్రయిస్తున్న టాప్ 30 బ్రాండ్ల మద్యం ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. మరోవైపు పర్మిట్ రూమ్ లను అనుమతించే అంశంపై కమిటీ అధ్యయనం చేసిన అనంతరం నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పర్మిట్ రూంలు లేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగుతున్నారని…ఇది సమస్యలకు కారణం అవుతుందని అధికారులు వివరించారు. దీన్ని నివారించేందుకు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నా…పూర్తి గా నివారించ లేకపోతున్నామని…పర్మిట్ రూంలు ఇచ్చి…అక్కడి వరకే పరిమితం చేస్తే మంచిది అధికారులు వివరించారు. అలాగే పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లోనూ మైక్రో బ్రూవరీలను అనుమతించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఎక్సైజ్ ఐ ద్వారా డేగకన్ను పెట్టండి

అబ్కారీ శాఖ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అమలు చేసి ట్రేస్ అండ్ ట్రాకింగ్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డిస్టిలరీల నుంచి బెవరేజెస్ కార్పోరేషన్ వరకూ అలాగే దుకాణాల వరకూ వాహనాల కదలికలపై రియల్ టైమ్ లో ట్రాకింగ్ మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జీపీఎస్ పరికరాల ద్వారా మానిటర్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే ఆన్ లైన్ నగదు లావాదేవీలను ప్రోత్సహించాలని డిజిటల్ లావాదేవీల విషయంలో ఎక్కడా రాజీ లేకుండా చూడాలని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ దుకాణాలు ఉండడానికి వీల్లేదని సీఎం తేల్చి చెప్పారు. డేటా అనలటిక్స్ ద్వారా ఎప్పటికప్పుడు దుకాణాల్లోని స్టాక్స్ పై కూడా అంచనాకు రావాలని పేర్కోన్నారు. బెల్లపు ఊట, నాటు సారా తయారీ లాంటి వాటిపై డ్రోన్స్ తో నియంత్రణ సాధించాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here